1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో హైదరాబాద్ రాష్ట్రం కూడా కొత్త రాజ్యాంగ వ్యవస్థలోకి అడుగుపెట్టింది. అదే రోజున నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్‌ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించగా, అప్పటివరకు హైదరాబాద్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా పనిచేసిన సివిల్ సర్వీస్ అధికారి ముల్క్ రాజ్ వెల్లొడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు.. నియమిత ప్రభుత్వం. రెండేళ్ల తర్వాత, 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడింది. 1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు.
16 జిల్లాలు.. 142 నియోజకవర్గాలు.. 175 మంది ఎమ్మెల్యేలు
1952 ఎన్నికల సమయంలో హైదరాబాద్ రాష్ట్రం నేటి తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. మొత్తం 16 జిల్లాలతో కూడిన విస్తారమైన హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ఇందులో తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఉండగా.. మరాఠ్వాడా ప్రాంతంలో ఔరంగాబాద్, పర్బని, నాందేడ్, ఉస్మానాబాద్ జిల్లాలు, కర్ణాటక ప్రాంతంలో బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాలు ఉన్నాయి. బీరార్ ప్రాంతం కూడా హైదరాబాద్ సంస్థాన చరిత్రలో ప్రత్యేక పరిపాలనా సంబంధం కలిగి ఉంది. ఈ విధంగా 16 జిల్లాల్లో 142 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో 33 నియోజకవర్గాలు ద్విసభ్య నియోజకవర్గాలు. అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఎన్నికయ్యేవారు. ఒకరు జనరల్ కేటగిరీ అభ్యర్ధి, మరొకరు అప్పటి రిజర్వేషన్ విధానం ప్రకారం వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్ధి ఉండేవారు. దీంతో 142 నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యే 142 మంది సభ్యులకు అదనంగా 33 మంది రిజర్వు ప్రతినిధులు చేరడంతో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య మొత్తం 175 అయింది.
ఐదు ప్రధాన రాజకీయ శక్తుల పోటీ
1952లో జరిగిన ఈ తొలి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF), సోషలిస్ట్ పార్టీ, హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ, జస్టిస్ పార్టీ వంటి రాజకీయ శక్తులు ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో అప్పటికే రైతాంగ, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ద్వారా బలమైన పునాది ఏర్పరచుకున్న కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు.
57.67 శాతం పోలింగ్
1952 మార్చి 26 నుండి మార్చి 30 వరకు వివిధ దశలలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 90,21,680 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 52,02,214 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే దాదాపు 57.67 శాతం పోలింగ్ నమోదైంది. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ఎన్నికల దశలోకి మారుతున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేయడం ఈ ఎన్నికల ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
అతిపెద్ద రాజకీయ శక్తిగా కాంగ్రెస్
ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 93 స్థానాలతో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. మొత్తం 175 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. కాంగ్రెస్ తర్వాత పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ (PDF) 42 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. తెలంగాణలోని ముఖ్యంగా నల్గొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో PDF సాధించిన విజయాలు అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావాన్ని స్పష్టంగా చూపించాయి. ఇక సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలు, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ 10 స్థానాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ 5 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 14 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
ఆసక్తికరమైన రాజకీయ చిత్రం
1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఆసక్తికరమైన రాజకీయ చిత్రం కనిపిస్తుంది. కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిస్టుల పట్టు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించింది. నల్లగొండ జిల్లా PDFకు తిరుగులేని కంచుకోటగా నిలిచింది. జిల్లాలోని మొత్తం 14 శాసనసభ స్థానాలనూ PDF అభ్యర్థులే గెలుచుకున్నారు. వరంగల్‌లో 14 స్థానాలకు గాను PDF 9 స్థానాలు సాధించగా, కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కాయి. కరీంనగర్‌లోని 15 స్థానాల్లో PDF 7 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మొత్తంగా PDF గెలిచిన 42 స్థానాల్లో 30 స్థానాలు నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచే రావడం అప్పటి తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్న బలమైన ప్రజా పునాదిని తెలియజేస్తుంది.
తొలి సీఎంగా బూర్గుల
1952 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కాలనే అంశం కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. ముఖ్యంగా బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతల మధ్య సీఎం పదవి కోసం పోటీ నెలకొంది. పార్టీ శాసనసభా పక్షంలో బలాబలాలపై చర్చ జరిగిన అనంతరం బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో హైదరాబాద్ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పేరు చరిత్రలో నిలిచిపోయింది. 1952 మార్చి 6న కింగ్ కోఠిలోని తన నివాసంలో హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. బూర్గుల రామకృష్ణారావు కూడా ఎన్నికలకు ముందు నుంచే హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. వెల్లోడి ప్రభుత్వంలో ఆయన రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1952 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
12 మందితో క్యాబినెట్
బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో 12 మంది మంత్రులతో తొలి ఎన్నికైన హైదరాబాద్ రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. ఇందులో బిందు దిగంబరరావు (హోం), జి.ఎస్. మెల్కోటే (ఆర్థిక), అన్నారావు గనముఖి (స్థానిక పాలన), మర్రి చెన్నారెడ్డి (పౌర సరఫరాలు, వ్యవసాయం), దేవిసింగ్ చౌహాన్ (గ్రామీణాభివృద్ధి), పూల్‌చంద్ గాంధీ (విద్య, ఆరోగ్యం), సి. జగన్నాథరావు (న్యాయ), నవాజ్‌జంగ్ బహదూర్ (పబ్లిక్ వర్క్స్), శంకర్ డియో (సోషల్ సర్వీసెస్), వి.బి. రాజు (కార్మిక, ప్రణాళిక, సమాచార), కొండా వెంకటరంగారెడ్డి (ఎక్సైజ్, కస్టమ్స్, అటవీ), కొరటికర్ వినాయకరావు (పరిశ్రమలు, వాణిజ్యం) ఉన్నారు. పీడీఎఫ్‌కు చెందిన వి.డి. దేశ్‌ముఖ్ పాండే (మరాఠ్వాడ) ప్రతిపక్ష నేతగా, కాశీనాథరావు వైద్య స్పీకర్‌గా, పంపనగౌడ్ సక్రిప్ప డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆర్థిక సంక్షోభం నుంచి గాడిలోకి
నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే నాటికి హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. నిజాం పాలన చివరి దశలో ఆయుధాల కొనుగోలు, ప్రచారం వంటి వాటికి భారీగా ఖర్చు చేయడంతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు హైదరాబాద్ ప్రభుత్వం 1950లో మాజీ ఐసీఎస్ అధికారి ఏ.డీ. గోర్వాల అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. పరిపాలన, ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసిన కమిటీ అదే ఏడాది అక్టోబర్‌లో నివేదిక ఇచ్చింది. రాష్ట్ర పరిపాలనను ఆధునీకరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం వంటి పలు సంస్కరణలను సూచించింది. ఈ సూచనలను అమలు చేస్తే హైదరాబాద్ రాష్ట్రానికి ఏటా సుమారు రూ.350 లక్షల మిగులు ఏర్పడే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. ప్రభుత్వం ఈ సిఫారసులను అమలు చేయడంతో రాష్ట్ర పరిపాలన, ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించే ప్రక్రియకు పునాది పడింది.
సంస్కరణలు..విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలపై దృష్టి
బూర్గుల ప్రభుత్వం భూసంస్కరణలు, కౌలుదారుల హక్కులు, విద్య, పరిపాలనా మార్పులు, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలపై దృష్టి పెట్టింది. నిజాం కాలంలో పెద్ద భూస్వాములు, జాగీర్దారుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా భూమి సమస్య ఒక ప్రధాన నేపథ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో బూర్గుల ప్రభుత్వం కౌలుదారులకు రక్షణ కల్పించడం, భూస్వాముల అధిక భూస్వామ్యాన్ని నియంత్రించడం, సాగుదారుల హక్కులను బలోపేతం చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చింది. కౌలుదారులకు భూమిపై భద్రత కల్పించడం, అన్యాయమైన తొలగింపులను అడ్డుకోవడం వంటి అంశాలు ఆయన ప్రభుత్వ భూసంస్కరణల్లో కీలకంగా నిలిచాయి. రైతులు భూమిని సాగు చేస్తున్నప్పటికీ యాజమాన్య హక్కులు లేకపోవడం అప్పటి ప్రధాన సమస్య. కౌలుదారుల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించడం ద్వారా రైతులకు భూమిపై స్థిరత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.
500 మంది జనాభాకు ఒక పాఠశాల..మాతృ భాషలో బోధన
బూర్గుల ప్రభుత్వం విద్యా విస్తరణపై కూడా దృష్టి పెట్టింది. ప్రతి 500 మంది జనాభాకు ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు అప్పటి ప్రభుత్వ విధానాల్లో పేర్కొన్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మూడో తరగతి నుంచి హిందీ, ఐదో తరగతి నుంచి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా హైదరాబాద్, మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల చరిత్రలో నిలిచిపోయారు.
ఖమ్మం జిల్లా ఏర్పాటు
పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే నల్లగొండ జిల్లాలోని జనగాం తాలుకాను వరంగల్ జిల్లాలో కలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని నియంత్రించేందుకు 1955 జూలై 1న అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department) ఏర్పాటు చేశారు.
ముల్కీ ఉద్యమం.. బూర్గుల ప్రభుత్వం ఎలా స్పందించింది?
బూర్గుల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే 1952 ముల్కీ ఉద్యమం పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, స్థానికుల హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లతో విద్యార్థులు, యువత ఆందోళనకు దిగారు. ముల్కీ ఉద్యమం ఉధృతమైనప్పుడు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ముల్కీ నిబంధనల అమలు కోసం జరిగిన ఉద్యమంలో సిటీ కాలేజీ వద్ద పోలీసు కాల్పులు జరిగాయి. ఈ పోలీసు కాల్పుల్లో నలుగురు (మహమ్మద్ ఖాసిం, షేక్ మహబూబ్, రాములు, నిరంజన్) మరణించారు, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనతో హైదరాబాద్ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. ఈ ఘటనపై విచారణకు బూర్గుల ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 5న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని నియమించింది. ముల్కీ నిబంధనలలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, బోగస్ ముల్కీ సర్టిఫికేట్ల జారీని అరికట్టడానికి కే.వి. రంగారెడ్డి అధ్యక్షతన జి.ఎస్. మెల్కోటే, ఫూల్‌చంద్ గాంధీ, నవాజ్ జంగ్ బహదూర్ సభ్యులుగా ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చడానికి, విద్యార్థుల ఆందోళన తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఈ కమిటీల ద్వారా ముల్కీ హక్కుల పరిరక్షణకు హామీ ఇస్తూ, ముల్కీ చట్టాలలోని లోపాలను సవరించి స్థానికులకే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
భవిష్యత్ దిశగా బలమైన పునాదులు
1952 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు, బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోని తొలి ప్రజా ప్రభుత్వం—కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు; శతాబ్దాల రాచరిక వ్యవస్థ నుంచి స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు హైదరాబాద్ రాష్ట్రం వేసిన చారిత్రాత్మక అడుగు. తీవ్రమైన ఆర్థిక లోటు, పరిపాలనా సవాళ్లు, కౌలుదారీ సమస్యలు మరియు ఉపాధ్యాయుల బదిలీల నుంచి పుట్టుకొచ్చిన ముల్కీ ఉద్యమం వంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ... బూర్గుల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ప్రణాళికలు తెలంగాణ ప్రాంత భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయి. గోర్వాల కమిటీ ఆర్థిక సంస్కరణలు, కౌలుదారీ చట్టాల ద్వారా రైతులకు దక్కిన రక్షణ, మాతృభాషలో విద్యా బోధన, పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లా ఆవిర్భావం మరియు అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు వంటి నిర్ణయాలు ప్రజా సంక్షేమం పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టిని చాటి చెప్పాయి. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో హైదరాబాద్ రాష్ట్ర అధ్యాయం ముగిసినప్పటికీ... 1952 నాటి ఈ తొలి సాధారణ ఎన్నికలు, బూర్గుల ప్రభుత్వ సంస్కరణలు, స్థానిక హక్కుల కోసం వెల్లువెత్తిన ముల్కీ ఆందోళనలు తెలంగాణ సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య పరిణామక్రమంలో ఎప్పటికీ చెరిగిపోని సువర్ణాధ్యాయంగా నిలిచిపోతాయి.