ప్రభాత ఉదయం, హైదరాబాద్ : తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం మరో ఐదు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద 3,892.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు కేంద్రం 873.49 కోట్ల ఆర్థికసాయం మంజూరు చేసింది. నవంబర్ 3న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నాలుగో నేషనల్ అపెక్స్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. కాగా, ఈ ఐదు ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌కు గోదావరి తాగునీటి సరఫరా, వరంగల్‌లో వరద నివారణ, చారిత్రక కట్టడాల పరిరక్షణ, హన్మకొండలో వాణిజ్య కేంద్రం, అలంపూర్‌లో ఆలయ పట్టణ అభివృద్ధి ప్రధానమైనవి. ఈ ఐదు ప్రాజెక్టులతో కలిపి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణలో 8 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, మొత్తం ప్రాజెక్టుల విలువ 9,573.42 కోట్లకు చేరింది. వీటికి కేంద్రం అందించే సహాయం 2,293.75 కోట్లుగా ఉంది. ఇప్పటికే మొదటి నేషనల్ అపెక్స్ కమిటీలో వరంగల్ భూగర్భ డ్రైనేజీ, కరీంనగర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, ఖమ్మం ఏఐసీసీసీ ప్రాజెక్టులకు 5,681.04 కోట్ల ఆమోదం లభించింది. యూసీఎఫ్ నిబంధనల ప్రకారం కేంద్రం 20 నుంచి 25 శాతం సహాయం అందిస్తుండగా, కనీసం 50 శాతం నిధులు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, బ్యాంకు రుణాల ద్వారా సమీకరించాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం, పట్టణ స్థానిక సంస్థలు భరించాలి. తాజా ఆమోదాలతో తెలంగాణ పట్టణాభివృద్ధికి కొత్త ఊతం లభించనుండగా, నిధుల సమీకరణ, పనులు సకాలంలో పూర్తి చేయడం కీలకంగా మారనుంది
గోదావరి నీటి సరఫరా ఫేజ్-II, III ప్రాజెక్టులో భాగంగా 1,992 కోట్లతో ఘన్పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వరకు 120 కిలోమీటర్ల పైపులైన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.74 కోట్ల మందికి 2035 వరకు తాగునీటి అవసరాలు తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రేటర్ వరంగల్‌లో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థను 1,465 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. 407.70 చదరపు కిలోమీటర్ల పరిధిలో 24 ప్రధాన వరద ప్రభావిత ప్రాంతాలకు పరిష్కారం దక్కనుంది. 10 ప్రధాన చెరువుల కట్టల బలోపేతం, నాలాల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, పర్యవేక్షక నియంత్రణ, డేటా సేకరణ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. 100 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలను ఆధునీకరిస్తారు.
కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన వరంగల్ కోట కందకాన్ని రూ.209.08 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
హనుమకొండ ప్రాంతాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు 168.80 కోట్లతో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అలంపూర్‌ను వారసత్వ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 57.50 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇందులోభాగంగా జోగులాంబ ఆలయం, నవబ్రహ్మ ఆలయాల పరిసరాలను అభివృద్ధి చేయనున్నారు.