ప్రభాత ఉదయం, చేవెళ్ల : చామంతి పూలు చేతికొచ్చినా.. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా, ధరలు పడిపోవడంతో కోత, రవాణా ఖర్చులు కూడా చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోందని రైతు కన్నీటిపర్యంతమవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు కొండకల రాజు తనకున్న మూడు ఎకరాల్లో చామంతి సాగు చేపట్టారు. ఒక్కో మొక్కను రూ.2 చొప్పున కొనుగోలు చేసి, మొత్తం రూ.15 వేల విలువైన మొక్కలను నాటారు. డ్రిప్ ఇరిగేషన్ పైపులు, ఎరువులు, పురుగుమందులు, దుక్కి దున్నకం, కలుపు తీత, కూలీల ఖర్చులు కలిపి ఇప్పటివరకు సుమారు రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ సాగు కొనసాగించారు.
ఎంతో శ్రమించి పంటను కాపాడుకోవడంతో చామంతి పూల దిగుబడి బాగానే వచ్చింది. అయితే పూలను కోసి మార్కెట్‌కు తీసుకెళ్లే సమయానికి ధరలు పడిపోవడంతో ఆశించిన ఆదాయం రావడం లేదని రైతు వాపోతున్నారు. పూల విక్రయాల ద్వారా వచ్చే డబ్బులు కోత కూలీలకు, రవాణా చార్జీలకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కలు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానని కొండకల రాజు తెలిపారు. సుమారు రూ.6 లక్షలు అప్పు చేసి సాగు చేశానని, ఇప్పుడు పూలు అమ్మినా కూలీల ఖర్చులు కూడా రావడం లేదని చెప్పారు. పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోవడంతో చామంతి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్నా మార్కెట్‌లో తగిన ధర లభించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చామంతి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని, నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని కొండకల రాజు కోరుతున్నారు.