చిట్టీల డబ్బుల చెల్లింపుల్లో జాప్యంపై చేర్యాలలో వ్యాపారి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు 
తెలంగాణ

చిట్టీల పేరుతో కుచ్చుటోపీ..రూ.1.50 కోట్లతో పరారైన వ్యాపారి

చేర్యాల బీడీ కాలనీలో చిట్టీల వ్యాపారం చేస్తున్న మహ్మద్‌ అజీజ్‌ అహ్మద్‌ రెండేళ్లుగా చిట్టీలు పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా రూ.1.50 కోట్ల మేర బకాయిలు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, జనగామ: చిట్టీల పేరుతో ఓ వ్యాపారి బాధితులకు కుచ్చుటోపీ పెట్టిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీడీ కాలనీకి చెందిన మహ్మద్​ అజీజ్​ అహ్మద్ మూడు దశాబ్దాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాలనీవాసి కావడంతో అతన్ని నమ్మిన ఎంతోమంది చిట్టీలు వేస్తున్నారు. ఈ క్రమంలో చిట్టీలు పూర్తయిన సభ్యులకు  రెండేళ్లుగా  డబ్బులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాడు. సుమారు రూ.1.50 కోట్ల వరకు చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో అనుమానం వచ్చిన సభ్యులు వారం రోజులుగా అజీజ్​ అహ్మద్​ను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిర్వాహకుడు.. వారే అప్పులు ఇచ్చారంటూ కోర్టు ద్వారా సభ్యులకు ఐపీ(దివాలా పిటిషన్​)నోటీసులు  పంపించాడు. కాలనీలో చిట్టీలు వేస్తున్నవారు 50 మంది ఉంటే, కేవలం 28 మందికే నోటీసులు అందాయి. వారంతా ఆదివారం వ్యాపారి ఇంటి వద్ద ఆందోళన చేశారు.