ప్రభాత ఉదయం, హుస్నాబాద్: "మా కాలనీలో కోతుల బెడద పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే భయమేస్తోంది. దసరా సెలవుల్లో కనీసం ఆడుకోనివ్వకుండా దాడులకు దిగుతున్నాయి. దయచేసి ఆ వానరాల బారి నుంచి మమ్మల్ని కాపాడండి సార్" అంటూ హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన చిన్నారులు మున్సిపల్ అధికారులను వేడుకున్నారు.
కోతులను పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కాలనీ పెద్దలతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీచర్స్ కాలనీలో కొంతకాలంగా కోతుల సంచారం తీవ్రమైంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే చాలు దాడులకు పాల్పడుతున్నాయి.
గ్రామస్తులు మాట్లాడుతూ ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో చిన్నారులు ఆడుకోడానికి వీలులేకుండా పోయిందన్నారు. కోతులను పట్టి అడవిలో వదిలిపెట్టాలని ఇన్‌వర్డ్ సెక్షన్ అధికారి గడిపె ప్రశాంత్‌ను కోరారు.
కార్యక్రమంలో చిన్నారులు పూదరి రుషికేశ్, రోహన్, జక్కని రోహిత్, హర్షిత్, మోరె అశ్విత్, శ్రీనిధి, రిషిక, మధుమిత, మన్విత, కాలనీవాసులు అయిలేని మల్లికార్జునరెడ్డి, పూదరి సంపత్‌గౌడ్, సత్యనారాయణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.