తెలంగాణ

చొప్పదండి మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక 

చొప్పదండి మున్సిపాలిటీలో నలుగురు కో ఆప్షన్ సభ్యులుగా ఎండీ నస్రీన్‌ సుల్తానా, సమీనాసుల్తానా, మహేషుని సంధ్య, దూస అనసూయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Satya

ప్రభాత ఉదయం, చొప్పదండి: చొప్పదండి మున్సిపాలిటీలో నలుగురు కో ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సభ్యుల ఎన్నిక బుధవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా 10 మంది కాంగ్రెస్, ముగ్గురు బీజేపీ, ఒకరు బీఆర్‌ఎస్ సభ్యులు ఉన్నారు. ఈ దామాషా ప్రకారం నా కో ఆప్షన్ పదవులు ఏర్పడ్డాయి. ఇందులో రెండు మైనార్టీలకు, రెండు అనుభవం గల మాజీ ప్రజాప్రతినిధులకు కేటాయించారు. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో కో ఆప్షన్ సభ్యులుగా ఎండీ నస్రీన్‌ సుల్తానా, సమీనాసుల్తానా, మహేషుని సంధ్య, దూస అనసూయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అభినందించారు. మున్సిపాలిటీ పాలకవర్గం పూర్తిస్థాయిలో పట్టణ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. చొప్పదండి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లురి సరిత, వైస్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల మానసతో పాటు కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.