ప్రభాత ఉదయం, చొప్పదండి : అపరాలు (కంది, పెసర, బొబ్బెర, శనగ, మినుములు) సాగు చేసే రైతులకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ రూ. 500 బోనస్ చెల్లించనున్నట్లు చొప్పదండి పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సోమవారం పాలకవర్గ సభ్యులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తమ సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు మాత్రమే ఈ బోనస్ అందజేయనున్నట్లు చెప్పారు. సొసైటీ పరిధిలోని రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తుండడంతో పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని, మరో వైపు ఒకే రకమైన పంట సాగు కారణంగా దిగుబడి సైతం తగ్గుతుందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవడంతో పాటు నీటి వనరులను, విద్యుత్‌ను పొదుపుగా వాడుకునేలా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పప్పుదినుసులను సంఘం ఆధ్వర్యంలోనే కొనుగోలు, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు అందించేందుకు మిల్లును సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ నిజానపురం చందు, సీఈఓ తిరుపతి రెడ్డి, మండల వ్యవసాయాధికారి అంజిత్ కుమార్, డైరెక్టర్లు లింగంపల్లి దేవదాసు, పెద్దిరెడ్డి గణపతిరెడ్డి, కొట్టె చందు, మారు తిరుపతి రెడ్డి, గాండ్ల రాజయ్య, గంకిడి కృష్ణారెడ్డి, చొక్కల్ల కనకయ్య, కుర్ర రాజయ్య, పూదరి సత్యం పాల్గొన్నారు.