ప్రభాత ఉదయం, హైదరాబాద్: ‘రిజర్వ్ బ్యాంకు బంద్ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైనా పైసల అవసరం ఏర్పడితే.. హైదరాబాద్‌లోని ఏ యాదవ సోదరుడి ఇంటికి వెళ్లినా రెండు కోట్లకు తక్కువకాకుండా డబ్బులు దొరుకుతయ్’ అని సీఎం రేవంత్ రెడ్డి చమత్కరించారు. సిటీలో కరోడ్ పతి యాదవ సోదరులు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు కీలక భూమిక పోషిస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కడుపులో పెట్టుకుని, విశ్వాసాన్ని కల్పించిన జాతి అని ఆయన కొనియాడారు. నేటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లకొండ అని గుర్తుచేశారు. బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సదర్ కేవలం యాదవులకే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మగౌరవ సమ్మేళనం’ అని పేర్కొన్నారు. అయితే, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలన్న ఆలోచన చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత యాదవులు కోరగానే రాష్ట్ర పండుగగా ప్రకటించి, నిర్వహణకు రూ.5 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.
పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం
కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌ను ఎంఎల్ఏగా గెలిపించుకున్నామని చెప్పారు. అలాగే, ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా, అంజన్‌కుమార్ యాదవ్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జంగయ్య యాదవ్‌ను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించామని గుర్తుచేశారు. యాదగిరిగుట్టలో గోసంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ బాధ్యతను ఈశ్వరమ్మకు అప్పగించామన్నారు. రాబోయే రోజుల్లో యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశంలో తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేదే తమ ప్రయత్నమని, గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే యాదవ సోదరుల సహకారం కావాలని కోరారు. వారి ఆత్మగౌరవం, హక్కుల విషయంలోతన సహకారం ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు. బిహార్ నుంచి సదర్ కార్యక్రమానికి వచ్చిన ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, అక్షయ్ యాదవ్‌లకు సీఎం అభినందనలు తెలిపారు.
పశుసంపద పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత: డిప్యూటీ సీఎం భట్టి
భారతీయ పురాతన చరిత్రలో పశుసంపదకు విశేష ప్రాధాన్యం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాభారతంలోని గోగ్రహణ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ.. పశుసంపద ఒక రాజ్యానికి, దేశానికి ఎంత ముఖ్యమో ఈ ఘట్టం తెలియజేస్తుందని అన్నారు. వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు మూలమని, వ్యవసాయాన్ని బలోపేతం చేసే పశుసంపదను పరిరక్షించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని భట్టి పేర్కొన్నారు. అనంతరం సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన సదర్‌ను ఇప్పుడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. సంఖ్యాపరంగా బలమైన సామాజికవర్గంగా ఉన్న యాదవులు ఐక్యంగానిలిచి రాబోయే రోజుల్లో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలని తలసాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచందర్ రావు, రఘువీరారెడ్డి పాల్గొన్నారు.