ప్రభాత ఉదయం, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు వీలుగా మహారాష్ట్ర జల వనరుల శాఖాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. డిజైన్ ప్రకారం ఎత్తు తగ్గిస్తే ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరవని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై మహారాష్ట్ర జల వనరుల శాఖాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్లో ఉంచుతామని వెల్లడించారు. మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా అభ్యంతరం లేదని, ఒప్పంద పత్రాలు సమర్పిస్తూ వారికి కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.