ప్రభాత ఉదయం, హైదరాబాద్: హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 678 ఎకరాల్లో విడతలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ సాంకేతిక, అధునాతన ఇంజినీరింగ్ కేంద్రంగా మరింత బలోపేతం చేయాలన్న హ్యుందాయ్ లక్ష్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు అనుగుణంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో తమ సంస్థ భాగస్వామిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధులు వివరించిన తరువాత, అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హ్యుందాయ్ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆర్అండ్‌డీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నిమ్జ్‌లో ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది.