ప్రభాత ఉదయం, కొడంగల్ : ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ప్రభుత్వం మెగా రైతుమేళా నిర్వహించనుంది. శనివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేళాను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం, మంత్రులు స్టాళ్లను సందర్శిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ మెగా రైతు మేళాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించనున్నారు. మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలతో పాటు ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తన పరిశ్రమలు, బ్యాంకింగ్, వాలంతరి తదితర సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రోన్లు, నూతన వ్యవసాయ ఇన్పుట్స్, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలను స్టాళ్లలో ప్రదర్శించనున్నారు. రైతులకు ఉపయోగపడే ఆధునిక సాగు విధానాలు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అవకాశాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించనున్నారు.
శాస్త్రవేత్తలతో ముఖాముఖి
మేళాలో మూడు రోజుల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు, అవార్డు గ్రహీతలతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 2,500 మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేక హాలును ఏర్పాటు చేశారు. ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, సుస్థిర వ్యవసాయ విధానాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మొదటి రోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ నియోజకవర్గ రైతులు సుమారు 7,500 మంది పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు తదితర పరికరాలు, యూనిట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే, రెండో రోజు ఆదివారం మహిళా రైతులకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల పాత్ర, ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించనున్నారు. చివరి రోజు సోమవారం మొత్తం 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో మెగా రైతు మేళా ముగియనుంది.