ప్రభాత ఉదయం, హైదరాబాద్:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ఈ భూముల విక్రయంపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. భూములు అమ్మగా వచ్చే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందన్నారు. మియాపూర్‌లో 50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి చెందుతాయని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు సీఎం ధన్యవాదాలు తెలియచేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూ దాహం, ధన దాహంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్, ఆయన బంధువు, ఎంపీ డీ దామోదర్ రావు కలిసి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. మియాపూర్ భూముల విషయంలో దామోదర్ రావుకు గిఫ్ట్‌గా విలాసవంతమైన కార్లను గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందాయని ఆరోపించారు. తాము ఈ భూముల రక్షణకు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించామని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో, ఆ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని విలువైన భూముల కబ్జాకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా కబ్జాలపై పోరాటం చేయడంతోనే కక్ష గట్టి తనను జైలుకు పంపించారని తెలిపారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూములను కాపాడేందుకు తాను ముఖ్యమంత్రి అయ్యాక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న విలువైన భూములను విక్రయించి, నీటి పారుదల, విద్య, వైద్య తదితర రంగాలకు కేటాయిస్తామని, ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తీర్మానం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
మియాపూర్ భూములపై బీఆర్ఎస్ నేతలు స్పందించరా?
మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులను ఎందుకు అభినందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీశ్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్, హరీశ్ వారితో లాలూచీ పడ్డారని విమర్శించారు. మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ చెర నుంచి భూములు విడిపిస్తున్నాం
గచ్చిబౌలిలో ఐఎంజీ భారత్ భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూడగా, న్యాయ పోరాటంతో అడ్డుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కంచెగచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేశారని విమర్శించారు. గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 143 ఎకరాల భూమిని రాయలసీమ బిల్డర్స్‌తో కలిసి కేటీఆర్ కబ్జాకు ప్రయత్నిస్తే దానిని కాపాడి, ఆ స్థలంలో పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా మోడల్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా అప్పగిస్తే సుప్రీంకోర్టులో పోరాడి కాపాడామని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.
సర్వే చేయకుండా హరీశ్, ఆయన మామ స్టే తెచ్చుకున్నారు
సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్ రావు, ఆయన మామ హనుమంత రావు వాళ్లు కబ్జా చేసిన భూములు సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. కబ్జా భూముల్లో సర్వే చేయవద్దని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. భూముల ఆక్రమణపై బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, చౌకబారు విమర్శలు చేశారన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కబ్జాలపై శాసనసభలో చర్చించి, చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరించారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే శ్రీకాంతాచారి కాలనీ
ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ పక్కన ఉన్న రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారని సీఎం విమర్శించారు. అక్కడి ఆక్రమణలను తేల్చి ‘శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ’ నిర్మిస్తామని స్పష్టం చేశారు. తండ్రి, కొడుకు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని, ఆక్రమణలు చేయడం మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో వాళ్లు చేసిన, చేయించిన ఆక్రమణలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పు ఇస్తున్నాయని రేవంత్ రెడ్డి వివరించారు.