ఎల్ నినో ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల ఇబ్బందులు  
తెలంగాణ

సామాన్యుడిపై ‘కరువు’ పోటు

ఎల్‌నినో, వర్షాభావంపై ఆందోళనల మధ్య నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నప్పటికీ కృత్రిమ కొరత, అక్రమ నిల్వల ఆరోపణలు సామాన్యుడిని కలవరపెడుతున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, ప్రత్యేక ప్రతినిధి : దేశంలో వాతావరణ పరిస్థితులు, ఎల్​నినో ఎఫెక్ట్​తో సామాన్యుడి జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే కరువు, దాని పర్యవసనాలు పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ధరలు, కోసుకుపోతున్న ఉపాధి అవకాశాలు, భవిష్యత్​పై నీలినీడలు వెరసి సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి. ఇందుకు వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు తోడవుతున్నాయి. దేశంలో విపరీత పరిస్థితుల నేపథ్యంలో ఇదే అదనుగా దళారీ వ్యవస్థ విజృంభిస్తోంది. దీంతో భవిష్యత్​పై బెంగతో సామాన్యుడు బిక్కుబిక్కుమంటున్నాడు. కరువు పరిస్థితిని ఆసరాగా చేసుకుని మార్కెట్లో జరిగే కృత్రిమ కొరత వ్యాపారమే ముప్పుగా పరిణమిస్తోంది. ఈ పరిణామాలు వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో ఆహార నిల్వలు, ప్రజల స్థితిగతులపై  తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్లైమేట్​ అండ్ సొసైటీ అంచనాల ప్రకారం శీతాకాలంలో ఎల్‌ నినో మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆహార ఉత్పత్తులపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆహార నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 పెరిగిన ధరలు.. జేబులు ఖాళీ

ఎల్​ నినో ప్రభావంతో ఈ ఏడాది దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. దీంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీగా తగ్గిపోవడంతో ఆశించిన స్థాయిలో పంటల ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచుతుండటంతో పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే పిల్లల చదువులు, పెరిగిన జీవన వ్యయాలు, ధరలు పెరుగుదల.. వంటి అంశాలు ఈ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుండగా, కరువు పరిస్థితులు వారిని మరింత దయనీయ స్థితికి చేరుస్తున్నాయి. మరోవైపు, ‘వర్షపాతం తగ్గింది, కరువు ముంచుకొస్తోంది’ అంటూ మీడియా, సోషల్​ మీడియాల్లో ప్రచారంతో పేద వర్గాల్లో ఆహార నిల్వలపై ఆందోళన పెరుగుతోంది. ఫలితంగా ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. దీనివల్ల బియ్యం, పప్పుల ధరలు రెండింతలు అయినా కొనేందుకు అప్పులు చేసేందుకూ వెనుకాడటం లేదు. ఈ పరిస్థితులు వారిని ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

వ్యాపారుల కుమ్మక్కు.. ‘కృత్రిమ’ ధరలు

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కృత్రిమ కొరతలు మొదలయ్యాయి. రైతులు, పంటలే లక్ష్యంగా దళారులు రంగంలోకి దిగి అడ్డదిడ్డంగా కొనుగోలు చేస్తూ ప్రైవేటు గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం వాటిని బ్లాక్‌ మార్కెట్​కు తరలిస్తున్నారు. కొందరు పనిగట్టుకొని మీడియా, సోషల్​మీడియాల్లో ‘కరువుతో నిత్యావసరాల కొరత’ రాబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది సామాన్యులతోపాటు అన్నివర్గాల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. దీన్నే వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ధరలను కృత్రిమంగా పెంచి, అధిక లాభాలకు అమ్ముకుంటున్నారు. ఫలితంగా, బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల వరకు ప్రతీ వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది. వాస్తవానికి ఎఫ్‌సీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదు. దేశంలో బియ్యం, గోధుమల నిల్వలు ఐదేళ్లలో రికార్డు స్థాయికి చేరుకున్నట్లు లెక్కలు ఉన్నాయి. మరో రెండేళ్ల పాటు దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చగలిగే బఫర్‌ నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ, ధరల పెరుగుదలకు ప్రభుత్వాల ఉదాసీనత, వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మార్కెట్లను నిరంతరం పర్యవేక్షించి, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాలు చేష్టలుడిగిపోయాయి. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిరోధించడంలో ధరల నియంత్రణ కమిటీలు, పౌరసరఫరాలశాఖ దాడులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. వ్యాపారులు సృష్టిస్తున్న సిండికేట్లను బ్రేక్‌ చేయకపోవడం, ఆహార పదార్థాల నిల్వల పరిమితిపై కఠిన నిబంధనలను సకాలంలో అమలు చేయకపోవడం వల్ల సామాన్యుడిపై మోయలేని భారం పడుతోంది. ‘వర్షాలు పడకపోతే రైతు నష్టపోతున్నాడు, అదే నెపంతో వ్యాపారులు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు’ అని సోషల్ మీడియాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ పరిణామాలతో ‘అల్పాదాయ వర్గాలు, సామాన్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోటు వర్షపాతంతో ఆహార వ్యవస్థపై ప్రభావం

ఆహారధాన్యాల ఉత్పత్తిలో కీలకమైన నైరుతి రుతుపవనాలు వల్ల ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌-సెప్టెంబర్​ మధ్య దేశవ్యాప్తంగా 759.4 మి.మీ. వర్షపాతం మాత్రమే కురిసింది. ఇది సాధారణ సగటు 868.6 మి.మీ.తో పోలిస్తే ఇది 87.4 శాతం మాత్రమే. దేశవ్యాప్తంగా వానాకాలం సాగు విస్తీర్ణం కూడా గతేడాదితో పోలిస్తే తగ్గింది. తెలంగాణలో లోటు వర్షపాతం(17శాతం మాత్రమే)తో వానాకాలం, యాసంగి పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో వరి సాగు 54.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణ సాగు 65.96 లక్షల ఎకరాలు కాగా, 12 లక్షల ఎకరాల మేర తక్కువగా నమోదైంది. యాసంగిలో 50.20 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మరోవైపు, యాసంగిలో తెలంగాణలో దొడ్డు రకం వడ్లనే సాగు చేస్తారు. దీంతో సన్నాల కొరత ఏర్పడి, ఆహార భద్రతలో కీలకమైన ఉచిత బియ్యం పంపిణీకి ఆటంకం కలగనుంది. ఆహార భద్రతలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, చక్కెర, కూరగాయల ఉత్పత్తి కూడా కీలకమే. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గితే వీటి ధరలు కూడా పెరుగుతాయి. ఇది తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి.

 ప్రభుత్వాలు ఏం చేయాలి

ప్రభుత్వాలు ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీమ్‌ ద్వారా తన వద్ద ఉన్న బియ్యం, గోధుమ నిల్వలను వెంటనే మార్కెట్​లోకి విడుదల చేసి ధరలు తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ, పాలనాపరమైన వైఫల్యాలు, నిర్ణయాల్లో జాప్యంతో ఈ చర్యలు క్షేత్రస్థాయికి చేరేసరికి ప్రజల జేబు ఖాళీ అయిపోతోంది. ఈ క్రమంలో అసలు ఎల్​ నినో లేదా కరువు పరిస్థితుల కన్నా ‘వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కరువు’ అత్యంత ప్రమాదకరంగా మారిందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రైవేట్‌ గోదాములపై తనిఖీలు చేపట్టి, బ్లాక్​ మార్కెట్​ దందాను అరికట్టాలని సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోకపోతే, ఈ ద్రవ్యోల్బణ మంటలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.