ప్రభాత ఉదయం, హుజురాబాద్ : సీజన్ ప్రారంభంలో జోరుమీదున్న పత్తి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతులు పెరగడంతో స్థానిక మార్కెట్లలో ధరలు పడిపోతున్నాయి. పది రోజుల క్రితం క్వింటాకు గరిష్ఠంగా రూ.9,250 పలికిన ధర ప్రస్తుతం రూ.8,770కి చేరింది. స్వల్ప వ్యవధిలోనే క్వింటాపై రూ.480 తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సీజన్ ప్రారంభంలో పత్తి కొనుగోళ్లకు వ్యాపారులు పోటీపడ్డారు. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోళ్లు సాగాయి. సెప్టెంబర్ 26న కొత్త పత్తికి క్వింటాకు గరిష్ఠంగా రూ.8 వేల ధర లభించింది. దిగుబడులు తగ్గడం, యార్డుకు తక్కువ మొత్తంలో సరుకు రావడం, కొనుగోళ్లలో పోటీ పెరగడంతో ధరలు క్రమంగా పుంజుకున్నాయి. అక్టోబర్ 9న నాణ్యమైన పత్తికి రూ.8,620 పలకగా, 22 నాటికి గరిష్ఠ ధర రూ.9,250కి చేరింది. జాతీయ మార్కెట్లో క్యాండీ (356 కిలోల దూది), పత్తి గింజలకు గిరాకీ పెరగడంతో తెల్లబంగారం ధర రూ.10 వేలకు చేరుతుందనే అంచనాలు వెలువడ్డాయి. అయితే అనూహ్యంగా పరిస్థితి తలకిందులైంది. గతంలో రూ.67 వేలుగా ఉన్న క్యాండీ ధర రూ.64 వేలకు పడిపోయింది. పత్తి గింజల ధర కూడా క్వింటాకు రూ.4,500 నుంచి రూ.4,100కు తగ్గింది.
విదేశీ దిగుమతులతో..
ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఈజిప్టు, మాలి దేశాల నుంచి పత్తి భారీగా దిగుమతి అవుతోంది. జాతీయ మార్కెట్లో దూది, దారం ఉత్పత్తులకు కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించింది. విదేశాల నుంచి పత్తి దిగుమతులపై గతంలో ఎత్తివేసిన నిషేధాన్ని కొనసాగిస్తూ, అందుకు సంబంధించిన గడువును డిసెంబర్ వరకు పొడిగించింది. దీంతో ఆయా దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్నాయి. దీంతో పత్తి కొరత చాలా వరకు తీరుతుండటంతో స్థానిక మార్కెట్లపై ప్రభావం పడుతోంది. కొనుగోళ్లలో పోటీ తగ్గడంతో వారం రోజులుగా ధరలు దిగజారుతున్నాయి. జమ్మికుంట మార్కెట్లో అక్టోబర్ 26న క్వింటాకు రూ.9,100 పలికిన గరిష్ఠ ధర తాజాగా రూ.9 వేలకు పడిపోయింది. మంగళవారం యార్డుకు 1,873 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠ ధర రూ.8,770 మాత్రమే పలికింది. సగటు ధర రూ.8,650, కనిష్ఠ ధర రూ.8,300గా నమోదయ్యాయి. విదేశీ దిగుమతులు ఇలాగే కొనసాగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని జమ్మికుంటకు చెందిన పత్తి వ్యాపారి బచ్చు భాస్కర్ తెలిపారు.
సీసీఐ కొనుగోళ్లపై రైతుల ఆశలు..
మద్దతు ధర కల్పించేందుకు ఏటా సీసీఐ రంగంలోకి దిగుతోంది. ఈ ఏడాది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 23 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లోనే నేరుగా పత్తి సేకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు తగ్గుతుండటంతో రైతులు సీసీఐ కొనుగోళ్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. పత్తి నాణ్యతను బట్టి క్వింటాకు రూ.8,667 నుంచి రూ.8,267 వరకు చెల్లించనుంది. పత్తి ధర పెరుగుతుందనే ఆశతో పది క్వింటాళ్ల సరుకును నిల్వ ఉంచానని, ప్రస్తుతం మార్కెట్లో ధర భారీగా తగ్గడంతో తన దగ్గరున్న పత్తిని సీసీఐకి విక్రయిస్తానని జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన రైతు బొజ్జం సుమన్‌రెడ్డి తెలిపారు.