తెలంగాణ

గోదావరి నీటి లభ్యతపై 2023 నివేదికతో ముందుకెళుదాం.. తెలుగు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ లేఖ

గోదావరి నది నీటి లభ్యతపై 2023 అధ్యయన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని, అభ్యంతరాలుంటే తెలపాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేఖ రాసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : గోదావరి నదిలో నీటి లభ్యతపై 2023లో నిర్వహించిన సర్వే, అధ్యయనంతో రూపొందించిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని, దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అంతేగాక 2023 రిపోర్టుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా భావిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. అయితే 2023 నీటి లభ్యత నివేదికను ఆధారంగా చేసుకొని గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం చేపట్టే అవకాశాలున్నాయని కొందరు నీటిపారుదల శాఖాధికారులు వివరించారు.

సీడబ్ల్యూసీ నివేదికను ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పరిధిలోని గోదావరి బేసిన్‌లో 1,486 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలంగాణ పేర్కొంటుండగా, 2004లో వ్యాప్కోస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం1,360 టీఎంసీలేనని ఏపీ వాదిస్తోంది. 2023లో సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికలో నిర్ధారించిన నీటి లభ్యత లెక్కలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

గోదావరికి సంబంధించిన 8 ఉప నదులు తెలంగాణ భూభాగంలో ప్రవహిస్తున్నాయి. మంజీరా, మధ్య గోదావరి, మానేరు, పెన్‌గంగా, వార్ధా, వెన్‌గంగా/ప్రాణహిత, దిగువ గోదావరి, ఇంద్రావతి సబ్‌ బేసిన్లు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. శబరి గతంలో తెలంగాణ పరిధిలోనే ఉండటంతో పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో ఆ నది కూడా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయింది. ఈ ఉప నదుల పరిధిలో సాగుకు వాడుకుంటున్న నీళ్లలో 10 శాతం, తాగు అవసరాలకు వాడుకుంటున్న నీళ్లలో 97.5 శాతం, పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్న నీళ్లలో 80 శాతం తిరిగి గోదావరిలోనే కలుస్తున్నాయి. అందుచేత నీటిలభ్యత భారీగానే ఉందని కేంద్ర జల సంఘం భావిస్తోందని నీటిపారుదల అధికారులు వివరించారు. ఈ వాదనలో వాస్తవం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచే మొదలుపెట్టాలని కోరుతోందని వివరించారు.