Wardhannapet Dalit Woman Protest 
తెలంగాణ

పెళ్లి చేసుకుంటానని నమ్మించి దళిత యువతికి మోసం

Ramana

–ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన బాధితురాలు

–దళిత సంఘాలతో కలిసి రెండో రోజు ఆందోళన

–వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కలకలం

ప్రభాత ఉదయం, వర్ధన్నపేట: తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దళిత యువతి వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కొడుకు ఇంటి ముందు ధర్నాకు దిగారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తానని తెలిపారు. వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్మన్‌ కుమారుడు పాలకుర్తి శ్రీకాంత్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని యువతి ఆరోపించారు. కొన్నేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని పేర్కొన్నారు. ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన కుటుంబ సభ్యులు, బంధువులు, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి శ్రీకాంత్ ఇంటి ముందు ఆమె సోమవారం చేపట్టిన ఆందోళన  రెండో రోజు కొనసాగింది. తనకు శ్రీకాంత్‌తో పెళ్లి జరిపించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. బాధితురాలికి మద్దతుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. యువతి ఆరోపణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలే

ఈ విషయంపై గతంలో  హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి పేర్కొన్నారు. అయినా, న్యాయం జరగలేదన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘‘ఇదివరకు మీరు పోలీసు అధికారిగా సేవలందించారు, ఇప్పుడు ప్రజల ప్రతినిధిగా చట్టసభలో ఉన్నారు. మీతోనే నాకు నిజమైన న్యాయం జరుగుతుంది’’ అంటూ వేడుకున్నానని బాధితురాలు చెప్పారు. అయితే, ప్రజాప్రతినిధిని ఆశ్రయించినా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళనకు దిగినట్లు యువతి పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

మున్సిపల్ చైర్మన్ కుమారుడు శ్రీకాంత్.. దళిత సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అనంతరం పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటవేస్తూ పలుమార్లు యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదుతో బయటపడింది. అంతేకాకుండా, ఆమె పలుమార్లు గర్భవతి అయితే బలవంగా అబార్షన్ చేయించినట్లు తెలిసింది.

బంధువులకు గోడు వెల్లబోసుకున్న బాధితురాలు

తమ ప్రేమ వ్యవహారం గురించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసునని బాధితురాలు అంతకుముందు తన బంధువుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉంచి శ్రీకాంత్ తనపై దాడి చేసినా భరించానని చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల పరిచయం, ప్రేమ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని అన్నారు. అలా చేయడం మోసమే అవుతుందని, తానలా చేయలేనని చెప్పుకొచ్చారు. ఎలాగైనా శ్రీకాంత్‌తో పెళ్లి జరిపించేలా చూడాలని బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు.

పార్టీ నేతల అండపై అనుమానాలు

జరిగిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. అయితే, నిందితుడు మున్సిపల్ చైర్మన్ కొడుకు కావడం, రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని బాధితురాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, యువతి చేసిన ఆరోపణలపై శ్రీకాంత్‌ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.