TSRTC Dasara Special Buses Fare Hike 
తెలంగాణ

ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు.. 50 శాతం అదనపు చార్జ్​

దసరా పండుగ ప్రయాణికులకు ఆర్టీసీ చార్జీల మోత మోగించింది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ఉప్పల్-వరంగల్ టికెట్ రూ.360కి చేరింది.

Haji Pasha

యాదాద్రి భువనగిరి, ప్రభాత ఉదయం: దసరా సీజన్​ వేళ ఆర్టీసీ స్పెషల్​ బస్సులు ఎక్కే ప్రయాణికుల జేబుకు చిల్లుపడుతోంది. ఈ బస్సుల్లో రెగ్యులర్ చార్జీలపై 50 శాతం అదనపు చార్జీలను కలిపి వసూలు చేస్తున్నారు. సాధారణంగా, భువనగిరి నుంచి ఆలేరుకు రెగ్యులర్ చార్జీ రూ.40, భువనగిరి నుంచి జనగామకు రూ.60గా ఉండేది. కానీ, ఇప్పుడీ రెండు మార్గాల్లో నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో రూ.60, రూ.90 చొప్పున చార్జీలను తీసుకుంటున్నారు. ఇక ఉప్పల్ నుంచి ఆలేరుకు రెగ్యులర్ చార్జీ రూ.120 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.190కి పెరిగిపోయింది. ఉప్పల్ నుంచి జనగామకైతే చార్జీ రూ.220 దాటేసింది. ఉప్పల్ నుంచి వరంగల్​కు చార్జీ రూ.240 నుంచి రూ.360కి చేరింది. అయితే, వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ రెగ్యులర్ చార్జీలనే తీసుకుంటోంది.

మరో మార్గం లేదాయె

ఈ చార్జీల బాదుడు నుంచి తప్పించుకునే ప్రత్యామ్నాయ మార్గమేదీ ప్రయాణికులకు కనిపించడం లేదు. ఎందుకంటే రెగ్యులర్​గా నడిచే బస్సులకే ‘దసరా స్పెషల్’ బోర్డులు పెట్టి నడిపిస్తున్నారు. దీంతో రెగ్యులర్ బస్సు సర్వీసులు పెద్దగా కనిపించకుండా పోయాయి. ఈ అనివార్య పరిస్థితుల్లో స్పెషల్​ బస్సుల్లోనే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అసలే నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కష్టకాలంలో స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ అదనపు చార్జీలను బాదుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. పండుగ సీజన్​లో ప్రజల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాల్సింది పోయి, అదనపు చార్జీల కోసం నడుపుతున్నారని వాపోతున్నారు.