ప్రభాత ఉదయం, హైదరాబాద్ : వివిధ ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని గురువారం డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన పెండింగ్, అదనపు బిల్లులను మంజూరు చేయాలని వినతి పత్రం అందచేశారు. తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికలు-2023, లోక్‌సభ ఎన్నికలు-2024 సందర్భంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా చేసిన వ్యయాలు, కేటాయించిన బడ్జెట్‌ను మించిపోయాయని లచ్చిరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అదనపు బడ్జెట్ మంజూరు చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో వివిధ ఖాతాల కింద కేటాయించిన బడ్జెట్ సరిపోకపోవడంతో పలు అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అదనపు ఖర్చులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఖర్చులను అప్పుల రూపంలో సమకూర్చుకోవాల్సి వచ్చిందని, సంబంధిత బిల్లుల చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బకాయిల చెల్లింపుల కోసం అప్పులిచ్చిన వారిలో కొందరు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు అప్పటి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, నివాసాలకు వెళ్లి ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారడమే కాకుండా వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల అదనపు బడ్జెట్ మంజూరు కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, అవి వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలను లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణలో చేసిన అదనపు వ్యయాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించి, అదనపు బడ్జెట్‌ను మంజూరు చేయాలని సీఈఓను కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం నాయకులు శకుంతల, లావణ్య, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాములు తదితరులు ఉన్నారు.