దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీటి సరఫరా 
తెలంగాణ

తాగు, సాగు నీటికి ‘దేవాదుల’ భరోసా

కరువు పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు నీటి భరోసాగా నిలుస్తోంది. నాలుగు నెలల్లో 17 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, జయశంకర్ భూపాలపల్లి: ఉమ్మడి వరంగల్​ జిల్లా తాగు, సాగు నీటి అవసరాలకు దేవాదుల లిఫ్ట్​ ఇరిగేషన్​ పెద్ద దిక్కులా మారింది. మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కరకు రాకుండా పోగా..​ కరువులో దేవాదుల నుంచి గోదావరి నీటిని లిఫ్ట్​ చేస్తుండటంతో కొండంత భరోసా కలుగుతోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గంగారం వద్ద గల దేవాదుల ఇన్​టెక్ వెల్ నుంచి 9 మోటర్ల ద్వారా నీటిని పంప్ చేస్తున్నారు. నాలుగు నెలల్లో 17 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నీరు భూపాలపల్లి మండలం భీంఘనపూర్​ రిజర్వాయర్​కు చేరుతోంది. అక్కడి నుంచి పులుకుర్తి, రామప్ప, చలివాగుకు తరలిస్తున్నారు.

భీంఘనపూర్ నుంచి ఎగువకు..

భీంఘనపూర్ రిజర్వాయర్ (సామర్థ్యం 0.38టీఎంసీలు)​కు చేరిన గోదావరి జలాలను అధికారులు 3 ఫేజ్​లలో ఎగువ ప్రాంతాలకు పంప్​ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజూ 0.23 టీఎంసీల నీటిని లిఫ్ట్​ చేస్తున్నారు. భీంఘనపూర్ రిజర్వాయర్ వద్ద మొదటి, రెండో ఫేజ్ పంపు హౌస్ నుంచి నాలుగు మోటర్ల ద్వారా, మూడో ఫేజ్ పంపు హౌస్ నుంచి మూడు మోటర్ల ద్వారా జూలై 2 నుంచి నీటి తరలింపు కొనసాగుతోంది. ఒకటో ఫేజ్ ద్వారా పులుకుర్తికి అక్కడి నుంచి ధర్మసాగర్​కు, రెండో ఫేజ్ ద్వారా చలివాగు ద్వారా ధర్మసాగర్​కు, మూడో ఫేజ్​ ద్వారా రామప్పకు నీటిని మళ్లిస్తున్నారు. రామప్పకు చేరిన నీటిని టన్నెల్ ద్వారా దేవన్నపేట, పాకాల, ములుగు, గణప సముద్రం చెరువుకు తరలిస్తున్నారు. నాలుగు నెలలుగా భీంఘనపూర్ రిజర్వాయర్ నుంచి 17 టీఎంసీలు పంప్​ చేశామని ఇరిగేషన్​ ఏఈ క్రాంతి తెలిపారు.

ఉమ్మడి జిల్లాకు తాగునీరు

ఉమ్మడి వరంగల్​ జిల్లా తాగునీటి అవసరాలకు దేవాదుల నీటిని వినియోగిస్తున్నారు. భీంఘనపూర్ రిజర్వాయర్ సమీపంలో నిర్మించిన మిషన్​ భగీరథ ఇన్​టెక్​ వెల్​ నుంచి కోనంపేట పంప్​ హౌస్​కు రోజుకు 1 ఎంసీఎఫ్​టీ నీటిని పంప్​ చేస్తున్నారు. దీని ద్వారా మంథని, భూపాలపల్లి నియోజకవర్గాలకు తాగునీటిని సప్లయ్​ చేస్తున్నారు. రామప్ప నుంచి కాలువ ద్వారా గణప సముద్రం చెరువును నింపుతుండటంతో అక్కడున్న మిషన్ భగీరథ పంపు హౌస్ ద్వారా రోజుకు 1.2 ఎంసీఎఫ్​టీల తాగునీటిని తరలిస్తున్నట్లు భగీరథ ఈఈ సురేందర్ తెలిపారు.