ప్రభాత ఉదయం, కరీంనగర్: ఆధార్ బయోమెట్రిక్ పేద కుటుంబాలకు శాపంగా మారింది. వేలి ముద్రలు సరిగా పడకపోవడంతో దివ్యాంగ పెన్షన్లతో పాటు రేషన్ కూడా అందని దుస్థితి నెలకొంది. తన దివ్యాంగులైన భర్త, కొడుకులను తీసుకుని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఓ తల్లి బాధ అందరినీ కలచివేసింది.
కుటుంబ భారమంతా ఆ తల్లిపైనే..
ఎల్‌ఎండీలో నివాసముండే కట్కూరి బుచ్చమ్మకు ఇద్దరు కుమారులు దేవేందర్, వెంకటేశ్. వారిద్దరూ దివ్యాంగులే. కుటుంబానికి అండగా ఉండాల్సిన భర్త చందర్ కూడా దివ్యాంగుడు కావడంతో కుటుంబ పోషణ భారమంతా బుచ్చమ్మపైనే పడింది. స్థానిక హాస్టల్‌లో ఆయాగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ బయోమెట్రిక్ సమస్య ఆమెకు మరో భారంగా మారింది.
ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు!
తన భర్త, కుమారులను పలుమార్లు ఆధార్ కేంద్రాలకు తీసుకెళ్లినా వేలిముద్రలు పడటం లేదంటూ వెనక్కి పంపిస్తున్నారని బుచ్చమ్మ వాపోయింది. ఆధార్ అప్‌డేట్ కాకపోవడంతో దివ్యాంగ పెన్షన్లు నిలిచిపోతాయేమోనని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపింది. గతంలోనూ కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందించినా సమస్య తీరలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
పెన్షన్ ఆగితే మా పరిస్థితి ఏంటి?
‘‘సమస్యను ఎలా పరిష్కరించాలో అధికారులు చెప్పడం లేదు. పెన్షన్ ఆగిపోతే మా పరిస్థితి ఏంటి?’’ అంటూ బుచ్చమ్మ కన్నీటిపర్యంతమైంది. బయోమెట్రిక్ సమస్యతో రేషన్ తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు తన దివ్యాంగ కుమారులను వెంట తీసుకెళ్లాల్సి వస్తోందని, వారిని చూసిన తర్వాతే బియ్యం ఇస్తున్నారని వాపోయింది. తన కుటుంబానికి పెన్షన్లు, రేషన్ అందేలా బయోమెట్రిక్ సమస్యకు పరిష్కారం చూపాలని, వేలిముద్రలు పడని కారణంతో సంక్షేమ పథకాలు నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ విధానంలో సేవలు అందించాలని అధికారులను వేడుకుంది.