ప్రభాత ఉదయం, హైదరాబాద్ : జనం బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు దీపావళి పండుగ పేరుతో ఫేక్ ఆఫర్లకు తెరలేపారు. దేశ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల నగదు ప్రయోజనం అందిస్తోందంటూ ప్రధాన మంత్రి పేరుతో వాట్సాప్‌లో అనుమానస్పద వెబ్‌సైట్ల ఫేక్ లింక్‌లు పంపిస్తున్నారని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ హెచ్చరించారు. పండుగల సమయంలో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని డీజీ తెలిపారు. నకిలీ లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సేకరించడంతోపాటు అనధికార యూపీఐ లావాదేవీలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లలో హ్యకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి సందేశాలను నమ్మవద్దని, లింక్‌లను క్లిక్ చేయడం లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేయడం చేయవద్దని సూచించారు.
ప్రభుత్వ పథకాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను గుర్తుతెలియని వెబ్‌సైట్‌లలో నమోదు చేయవద్దని హెచ్చరించారు. అనధికారిక ఆర్థిక లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించి, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.