ప్రభాత ఉదయం, కల్వకుర్తి: ఆరు నెలల క్రితమే పుట్టిన పసికందు ముసిముసి నవ్వులను తనివితీరా ఆస్వాదించాలని తండ్రి ఎంతో ఉత్సాహంగా బయలుదేరాడు. మార్గమధ్యంలో విధి వక్రీకరించి బిడ్డను చూడకుండానే శాశ్వతంగా దూరమయ్యాడు. ఈ విషాద ఘటన వెల్దండ మండలం పెద్దాపూర్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ యుగంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాలకు చెందిన వెంకటరమణ (32) హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆధారం కోల్పోయిన కుటుంబం
కుటుంబ పోషణ కోసం కష్టపడుతూ భార్యాబిడ్డల భవిష్యత్తు కోసం కలలు కన్న ఆ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యకు తీరని శోకం మిగిలింది. ఇంటి యజమాని విగతజీవిగా మారడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. మృతుడి బంధువు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.