ప్రభాత ఉదయం, హైదరాబాద్, చేవెళ్ల : రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. చదువుల కోసం క్యాంపస్‌లకు వచ్చిన స్టూడెంట్లు మత్తుకు బానిసవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), నల్సార్, గీతం, మహీంద్రా వంటి ప్రముఖ వర్సిటీల్లో కొందరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్టు ఇటీవల నిర్వహించిన ఈగల్ ఫోర్స్ దాడుల్లో బయటపడింది. డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయంటూ వచ్చిన సమాచారంతో ఈ నెల 29న ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థులను ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వీరికి టెస్ట్‌లు చేయగా డ్రగ్స్ (టెట్రాహైడ్రో కాన్నబినాల్) తీసుకున్నట్లు తేలింది. గతంలోనూ ఈ యూనివర్సిటీకి చెందిన 22 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం అధికారులు తెలిపారు. ఈ రెండు కేసుల్లో మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నల్సార్ యూనివర్సిటీ హాస్టళ్లలోనూ స్టూడెంట్లు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసిందని ఈగల్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. ఈ వర్సిటీలో సోదాలు నిర్వహించి 17 మంది విద్యార్థులకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు తేలిందన్నారు. డ్రగ్స్ తీసుకుని ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలూ జరిగాయని చెప్పారు. ఈమధ్యే ముగ్గురు స్టూడెంట్లు బైక్‌పై వెళ్తుండగా యూనివర్సిటీకి దగ్గరలోనే రోడ్డు ప్రమాదానికి గురై అందులో ఒకరు చనిపోయారని వివరించారు. స్పాట్‌కు వెళ్లి పరిశీలించగా చనిపోయిన స్టూడెంట్ వద్ద గంజాయి ప్యాకెట్ దొరికిందని పోలీసులు చెప్పారు. మిగిలిన ఇద్దరికి టెస్ట్ చేయగా టీహెచ్‌సీ ఆనవాళ్లు బయటపడ్డాయన్నారు. గీతం యూనివర్సిటీలోనూ ఇద్దరు స్టూడెంట్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఫోర్స్ టీమ్ తెలిపింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నానక్‌రామ్‌గూడలో గంజాయి కొన్నట్లు వెల్లడించారని తెలిపింది. డ్రగ్స్ కట్టడికి కొంతకాలంగా పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ ప్రయత్నిస్తుండగా యూనివర్సిటీల్లోనే ఇలా డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు
సరదాకోసం స్టూడెంట్లు రేవ్ పార్టీలు నిర్వహించడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా చేవెళ్లలో రేవ్ పార్టీ నిర్వహిస్తూ 108 స్టూడెంట్లు శుక్రవారం పోలీసులకు చిక్కారు. గుట్టుచప్పుడు కాకుండా కమ్మెట గ్రామంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తుండగా ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో 108 మంది స్టూడెంట్లు ఉన్నారని ఎస్వోటీ పోలీసులు తెలిపారు. వాళ్లందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయగా రేవ్ పార్టీ నిర్వాహకుడు మన్నన్తోపాటు మరో ఇద్దరు విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ‘పార్టీ నిర్వాహకుడు మన్నన్ గతంలో శంకర్పల్లి మండలం దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీ (ఐబీఎస్)లో ఫ్రెషర్స్ డే నిర్వహించాడు. ఈ క్రమంలో విద్యార్థులతో పరిచయాలు ఏర్పడ్డాయి. శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారికి సమాచారం ఇచ్చాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేశాడు. పార్టీ జరిగే ప్రదేశాన్ని గోప్యంగా ఉంచి, డబ్బులు చెల్లించినవారికి చివరి నిమిషంలో ఫామ్‌హౌస్ లొకేషన్ పంపించాడు’ అని వెల్లడించారు. పార్టీ జరుగుతున్నదని సమాచారం రావడంతో స్థానిక పోలీసులతో కలిసి దాడి చేశామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేవెళ్ల సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారనేదానిపై ఆరా తీస్తున్నామన్నారు.