తెలంగాణ

అడుగంటిన సింగూరు.. మైదానంలా మంజీరా

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురువలేదు. ఫలితంగా తాగు, సాగునీటి సమస్య తలెత్తింది. సంగారెడ్డి జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది.

B. Suresh

ప్రభాత ఉదయం, సంగారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురువలేదు. ఫలితంగా తాగు, సాగునీటి సమస్య తలెత్తింది. సంగారెడ్డి జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు  సాధారణం కన్నా 18 శాతం తక్కువగా వాన కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 28 మండలాలు ఉండగా, 16 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.

సంగారెడ్డి జిల్లాలో కీలకమైన సింగూరు ప్రాజెక్టు అడుగంటగా.., మంజీరా మైదానాన్ని తలపిస్తోంది. జలాశయాల్లో తగినన్ని నిల్వలు లేక.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు బోర్లు ఉన్న రైతులు తమ పొలాలకు నీటిని అందివ్వడానికి ప్రయత్నిస్తుంటే కరెంటు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

పడిపోతున్న భూగర్భ జలాలు

జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబర్ పూర్తయ్యేసరికి 12.18 మీటర్లకు పడిపోయింది. కొండాపూర్, కంది, సదాశివపేట మండలాల్లో 16.81 మీటర్లు.. వట్‌పల్లి, పులికల్, రాయికోడ్ మండలాల్లో 3.81 మీ, గుమ్మడిదల, జిన్నారం మండలాల్లో 18.15 మీ, చెర్గాపూర్, కంగ్టి, నిజాంపేట్ మండలాల్లో 11.17 మీ, జహీరాబాద్, మొగుడంపల్లి, నాల్కల్ మండలాల్లో 11.08 మీటర్లకు చేరడంతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.

 పొంచి ఉన్న ముప్పు

మెతుకుసీమకు జీవధారైన సింగూరు ప్రాజెక్టు 29.917 టీఎంసీల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 3.838 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాలు తీర్చడంలో ఎంతో కీలకమైంది సింగూరు.  ఎల్‌నినో ప్రభావంతో సింగూరు పరివాక ప్రాంతంలో వర్షాలు కురవక ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. పైగా మరమ్మతు పనులు సాగుతున్న క్రమంలో ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించి.. ఉన్న కొద్దిపాటి జలాన్ని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు అడుగంటడంతో పలు గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. నీటి ఎద్దడి కారణంగా పలు పరిశ్రమలకు సరఫరా ఆపేస్తామని అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం గమనార్హం. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు మరో నాలుగు నెలలు మాత్రమే సరిపోతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ వాసులకూ తాగునీటి ఎద్దడి తప్పేలా లేదు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.