ప్రభాత ఉదయం, హైదరాబాద్ : చిన్నచిన్నగా గంజాయి అమ్మే స్థాయి నుంచి కోట్ల రూపాయల మాదకద్రవ్యాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అస్సాంకు చెందిన భాస్కర్ హజారికాతో పాటు మరో నలుగురు నిందితులను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. 60 రోజుల నుంచి వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టి అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు గురువారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చౌటుప్పల్ పోలీసులతో కలిసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 24.7 కిలోల గంజాయి, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాబు బోరా, నిర్మల్ హజారికా, ప్రణజల్ దత్తా, అకన్ రాజ్‌బన్షీ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. వీరంతా అస్సాంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రీమియర్ నగర్, న్యూ హఫీజ్‌పేట్ ప్రాంతాల్లో ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారని తెలిపారు.
పది నెలల్లో 1.80 కోట్ల వ్యాపారం
ప్రధాన నిందితుడైన భాస్కర్ హజారికా ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి అక్టోబర్ 29 వరకు ఒడిశాకు చెందిన ఆశిశ్కుమార్కు 88 విడతల్లో 48 లక్షలు చెల్లించి గంజాయి కొనుగోలు చేసినట్లు బ్యాంకు లావాదేవీల ద్వారా ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. కిలో గంజాయిని 12 వేల రూపాయల నుంచి 15 వేలకు కొనుగోలు చేసి, దానిని 50 వేల వరకు విక్రయించేవాడని విచారణలో వెల్లడైంది. పది నెలల్లో 400 కిలోల గంజాయి సరఫరా చేసి 1.80 కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు.