ప్రభాత ఉదయం, తాండూరు : ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితుల కారణంగా పసుపు రైతులు నష్టాల పాలవుతున్నారు. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటడం, మరో వైపు చెరువులు, వాగుల్లో నీరు లేకపోవడంతో పసుపు సాగు కష్టంగా మారింది. కొందరు రైతులు పక్కవారి బోర్లను అద్దెకు తీసుకొని పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు రూ. లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు.
సాగు 2 వేల ఎకరాలకుపైనే..
నాగులపల్లి గ్రామంలో 2 వేల ఎకరాలకుపైగా పసుపు సాగు చేస్తున్నారు. గ్రామం చుట్టూ ఉన్న చెరువులు, వాగుల్లో కరువు కారణంగా చుక్క నీరు లేకుండా పోయింది. పొలాల్లో ఉన్న బోర్లు పూర్తిగా అడుగంటాయి. దీంతో మరో ఐదారు నెలల్లో చేతికి రావాల్సిన పంట నీరు లేని కారణంగా వాడిపోయి కనిపిస్తోంది. ఇప్పటికే అరచేతి మందంలో దుంపలు ఏర్పడాల్సి ఉన్నప్పటికీ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా పిందెల మాదిరిగానే కనిపిస్తున్నాయి. మరోవైపు తెగుళ్లు పంట ఎదుగుదలకు అవరోధంగా మారాయి. పత్తి మాదిరిగానే... పసుపు పంటకు సైతం మందులు కొట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
తడుల కోసం అదనపు భారం
పొలాల్లో ఉన్న బోర్లు ఇప్పటికే పూర్తిగా అడుగంటిపోయాయి. పంట సాగు కాలం మరో ఐదారు నెలలు ఉండడంతో నీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తడుల కోసం పక్క రైతుల బోర్ల నుంచి నీటిని అద్దెకు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కో తడికి రూ. 1500 నుంచి రూ. 2 వేలు ఖర్చు చేస్తున్నారు. మరికొందరు రూ లక్షల అప్పు తెచ్చి కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు. “ఐదు ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నాను. పంట ఏపుగా పెరిగినా బోరు ఎండిపోవడంతో నీరు అందడం లేదు. రూ. 50 వేలు ఖర్చు చేసి బోరును అద్దెకు తీసుకున్నాను” అని నాగరాజు అనే రైతు వాపోయారు.
పంట దిగుబడిపై ప్రభావం
పసుపు సాగు కోసం ఎకరానికి రూ. 75 వేల నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడి పెడుతున్నారు. సాధారణంగా పసుపు ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సంవత్సరం కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.