తెలంగాణ

యాసంగి సాగుకు ప్రణాళిక ఖరారు

ఎల్​ నినో యాసంగి పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపనున్నది. గడిచిన వానకాలం సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు.

Munja Srinivas

ప్రభాత ఉదయం, కరీంనగరం: ఎల్​నినో యాసంగి పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపనున్నది. గడిచిన వానకాలం సీజన్​లో ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. చెరువులు, కుంటల్లోనూ నీళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఆరుతడి పంటలే మేలు అని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నీటి వనరులను బట్టి సాగు అంచనాలను రూపొందించారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది 2,25,644 ఎకరాల్లో వరితోపాటు ఆరుతడి పంటలను సాగు చేయనున్నారని అంచనా వేశారు. 2025-26 యాసంగి సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 3,20,189 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేశారు. ఇందులో 2,82,845 ఎకరాల్లో వరి, 37,344 ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలు పండించారు. ఈ సీజన్​లో మొత్తం 2,25,644 ఎకరాల్లో పంటలు సాగవుతాయని, ఇందులో 1,48,953 ఎకరాల్లో వరి, 60,177 ఎకరాల్లో మొక్కజొన్న, 6,114 ఎకరాల్లో వేరుశనగ, 4,578 ఎకరాల్లో పెసర, తదితర పంటలు సాగు కానున్నదని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది కంటే వరి పంట 1,33,892 ఎకరాల్లో తగ్గనున్నదని, మొత్తం 94,545 ఎకరాల్లో పంటలు వేసేందుకు అవకాశాలు లేవని ప్రణాళికలో పేర్కొన్నారు.

18 శాతం తగ్గిన సాగు

గడిచిన వానకాలం సీజన్​లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనా ప్రకారం పంటల సాగు 18 శాతం తగ్గుముఖం పట్టింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు నుంచి సాగునీటిని విడుదల చేయలేదు. దీంతో రైతులు బావులు, వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను వేశారు.

విత్తనాలకు సబ్సిడీ ఏది..?

వర్షభావ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలను ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వానకాలం సీజన్​లో పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.