ప్రభాత ఉదయం, ఇబ్రహీంపట్నం : కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ ప్రింట్చేస్తున్న ముఠాను ఫ్యూచర్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.6.78 కోట్ల రూ.500 నకిలీ కరెన్సీతో పాటు స్కానర్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. సోమవారం రాత్రి కుంట్లూరు నుంచి విజయవాడకు నకిలీ కరెన్సీ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, మహేశ్వరం, షాద్‌నగర్ ఎస్వోటీ బృందాలు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ ఎదురుగా వాహన తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో మారుతి డిజైర్ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. కారులోని బ్యాగులో నకిలీ రూ.500 నోట్ల కట్టలు రూ.8 లక్షలు బయటపడ్డాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా కుంట్లూరులోని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. అక్కడ రూ.6.70 కోట్ల విలువైన 134 కట్టల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో లభించిన నోట్లతో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. ‘నిందితులు నెల రోజుల క్రితం కుంట్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ కరెన్సీ తయారీకి శ్రీకారం చుట్టారు. ముంబై, గుజరాత్ నుంచి ముద్రణ సామగ్రిని కొనుగోలు చేశారు. ఆన్లైన్లో నోట్ల తయారీ పేపర్‌కు ఆర్డర్ చేశారు. అంతా సమకూరాక నోట్ల తయారీకి పూనుకున్నారు. అసలు రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫొటోషాప్‌లో వాటిని ఎడిట్చేసి కలర్ ప్రింటర్ల సహాయంతో నకిలీ నోట్లను ముద్రించారు. ముద్రించిన నోట్లను మార్కెట్లో చలామణి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు’ అని సీపీ వివరించారు.
పోలీసులమంటూ వసూళ్లు..
నిందితులు నకిలీ కరెన్సీ ప్రింట్ చేయడమేకాకుండా నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలతో పోలీసులుగా నటిస్తూ.. వారి వద్ద నకిలీ కరెన్సీ తీసుకున్నవారినే బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడ్డారు. వారి నుంచి రూ.2 లక్షలు, రూ.3 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సీపీ తెలిపారు. ఈ కేసులో ఇబ్రహీంపట్నం మండలం, ఉప్పరిగూడెంకు చెందిన మడుపోజు కరుణాకర్, కూకట్పల్లి, వివేకానందనగర్ చెందిన చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, కుసునూర్పల్లి చెరుకుపెల్లికి చెందిన రత్నాకర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా యెనుగొండకు చెందిన కరణం అజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నకిలీ కరెన్సీ తయారీ వెనుక ఉన్న ప్రతిఒక్కరినీ అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, షాద్‌నగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ భూపాల్, శ్రీధర్, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజు పాల్గొన్నారు.