తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ములుగు జిల్లా జాకారంలో సోలార్ ఫెన్సింగ్ తీగలు తగిలి 65 ఏళ్ల రైతు సమ్మాలు మృతి చెందాడు. స్టార్టర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

Saidi Reddy

ప్రభాత ఉదయం, ములుగు:  అడవి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు చేను చుట్టూ ఏర్పాటుచేసిన సోలార్ పవర్ ఫెన్సింగ్ తీగలు తగిలి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా ములుగు మండలం జాకారంలో చోటుచేసుకున్నది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శామంతుల సమ్మాలు(65) గ్రామ శివారులో తనకున్న నాలుగెకరాల భూమిలో మొక్కజొన్న సాగుచేశాడు. పంటను అడవిపందులు నాశనం చేస్తుండటంతో దానిని రక్షించుకునేందుకు గత నెలలో సోలార్ పవర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. బుధవారం రాత్రి చేను వద్దకు వెళ్లిన సమ్మాలు.. ఫెన్సింగ్‌ను గమనించక తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, కరెంటు స్టార్టర్ నుంచి సోలార్ ఫెన్సింగ్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోనే కరెంట్ షాక్‌తో సమ్మాలు మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అడవి జంతువుల నుంచి పంట రక్షణకు నేరుగా విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదకరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.