ప్రభాత ఉదయం, మంచిర్యాల: విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండల కేంద్రంలో రైతులు గురువారం ర్యాలీ, ధర్నా చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఆవడం ఎక్స్ రోడ్ నుంచి భీమారం బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ కోతలతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చించారు. అనంతరం డీఈతో ఫోన్లో మాట్లాడించారు. ప్రస్తుతం అందుతున్న విద్యుత్ సరఫరాకు అదనంగా మరో నాలుగు గంటలు విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు భీమారం మండల బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.