రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారిణి 
తెలంగాణ

వరికి నీటి గండం

వేసవికి ముందే నీటి కొరత మొదలవడంతో కామారెడ్డి జిల్లాలో యాసంగి సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

Ranjith

ప్రభాత ఉదయం, కామారెడ్డి/జుక్కల్: వేసవికి ముందే నీటి తండ్లాట మొదలైంది. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుతుండగా.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతుకు యాసంగి రంది పట్టుకుంది. వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నయ పంటల సాగుకు రైతును సమాయత్తం చేస్తున్నారు.

నిజాంసాగర్​లో తగ్గుతున్న మట్టం

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో నీటి నిల్వలు తగ్గడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడం కష్టంగా మారింది. యాసంగిలో 3.50లక్షల వేల ఎకరాల్లో పంటలు సాగు చేపడితే ఇందులో సింహ భాగం వరిదే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడం కష్టంగా మారింది. దీంతో రైతులను ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలకు గాను సోమవారం నాటికి 9.4 టీఎంసీలే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి పోచారం ప్రాజెక్టులోకి నీరు వచ్చి అలుగు పారడంతో నిజాంసాగర్ లోకి ఈ స్థాయి నీళ్లు చేరాయి.  వేసవి నాటికి నిల్వ మరింత తగ్గే అవకాశముంది.  దీంతో యాసంగికి ఆయకట్టు ప్రాంతాల్లోనూ ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఆరుతడి, కూరగాయల సాగు మేలు

కామారెడ్డి జిల్లాలో  పంటల సాగుకు బోరు బావులే ఆధారం.  1.10 లక్షల బోరు బావులు ఉన్నాయి.  భూగర్బ జలాలు వేగంగా పడిపోతుండడంతో అక్టోబర్​ నాటికి జిల్లాలో సగటు నీటి మట్టం 10.5 మీటర్లకు చేరింది. సెప్టెంబర్​లో 8.68 మీటర్లు ఉండగా నెల రోజుల వ్యవధిలో 1.37 మీటర్లు కిందకు పోయాయి.  ఇప్పటికే 1,150 వరకు బోర్లు వట్టిపోయాయి.  సగం బోర్లలో నీటి ధారలు తగ్గాయి.  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బోర్లు అధికం. వీటి కింద వరి పంట అధిక విస్తీర్ణంలో సాగు కానుంది.  వానాకాలం సీజన్​లో సాగు చేసిన వరి పంటకు చాలా చోట్ల తడులు అందక పంట ఎండిపోయింది.  యాసంగిలో నీటి తడులు అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేపట్టాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.