ప్రభాత ఉదయం, వేములవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పర్వదినం పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా శుక్రవారం తీర్చిదిద్దారు.
ప్రత్యేక ఆకర్షణగా సదన్
మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను ఆలయ అధికారులు సిద్ధం చేశారు.
నిమజ్జన ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లువిరిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ, దసరా పండుగలకు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభాయమానంగా తయారైంది.