Utnoor Government Hospital 
తెలంగాణ

విజృంభిస్తున్న విషజ్వరాలు

ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గూడాల్లో జ్వరాల సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Ranjith

ప్రభాత ఉదయం, ఉట్నూర్: వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు ప్రబలుతున్నాయి. దీనికి తోడు పల్లె, పట్నం తేడా లేకుండా పారిశుద్ధ్య లోపించి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు విషజ్వరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఫాగింగ్ చేయించాలని.. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాలని పలువురు కోరుతున్నారు.   

ఆస్పత్రులకు రోగుల తాకిడి

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గూడేలు మంచంపట్టాయి. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, జైనూర్, సిర్పూర్(యు),   లింగాపూర్ మండలాల పరిధిలో పెద్ద సంఖ్యలో జ్వర పీడితులు ఉన్నారు. ఉట్నూర్ పట్టణంలోని బోయవాడ, శాంతినగర్, ఫకీర్ గుట్ట, గంగన్న పేట కాలనీలకు చెందిన చిన్నారులు, పెద్దలు, మహిళలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఏజెన్సీకి కేంద్ర బిందువుగా ఉన్న ఉట్నూర్ జిల్లా ఆస్పత్రికి జ్వర బాధితులు పెరుగుతున్నారు. వారం రోజులుగా ఔట్ పేషెంట్ విభాగానికి తాకిడి పెరుగుతోంది. ‘‘ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.’’ అని ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ జాదవ్ ఉపేందర్ అన్నారు.