ప్రభాత ఉదయం, నారాయణపేట: దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 70వ ఎస్‌జీఎఫ్ అండర్-14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వివిధ జట్లకు చెందిన క్రీడాకారులు నువ్వానేనా అన్నట్లు తలపడుతూ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. బరువు ఆధారిత కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ నారాయణపేట జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్‌శెట్టి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహులు, కార్యదర్శి రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.