తెలంగాణ

శరవేగంగా ఫాక్స్ సాగర్ అభివృద్ధి పనులు.. ఆలయాల తరలింపుపై ఉత్కంఠ!

జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు రూపురేఖలు మారనున్నాయి. చెరువును పునరుద్ధరించి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, కుత్బుల్లాపూర్ : జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు రూపురేఖలు మారనున్నాయి. చెరువును పునరుద్ధరించి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం రూ.75 కోట్లతో పూడికతీత, పారిశ్రామిక వ్యర్థాల తొలగింపు తదితర పనులకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం జేసీబీలతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫాక్స్ సాగర్ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువు ఆక్రమణకు గురైన ప్రాంతాలను పరిశీలించి, కబ్జాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 490 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ఆలయాల తరలింపుపైనే చర్చ

సుమారు 129 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న ఫాక్స్ సాగర్ చెరువు విస్తీర్ణం 490 ఎకరాలు కాగా, ఇందులో 150 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పూడికతీత, ఆక్రమణల తొలగింపునకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే చెరువు కట్టను ఆనుకుని సుమారు కిలోమీటరు మేర ఉన్న ఆలయాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వీటిని తరలించాల్సి వస్తుందా? అందుకు ఆలయ కమిటీలు అంగీకరిస్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైడ్రా అధికారులు ఆయా ఆలయ కమిటీల పెద్దలతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆలయాల తరలింపుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.