దండు మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు 
తెలంగాణ

పదే పదే కరెంట్ కట్..!

దండు మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడటంతో పరిశ్రమల ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో పరిశ్రమల ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ఒక్కరోజులోనే ఉదయం నుంచి ఐదుసార్లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కోసారి 10 నుంచి 20 నిమిషాల పాటు విద్యుత్‌ నిలిచిపోతోంది. అయితే తిరిగి కరెంట్​ వచ్చిన తర్వాత యంత్రాలను మళ్లీ ప్రారంభించి సాధారణ స్థితికి తీసుకురావడానికి మరో 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోందని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. విద్యుత్‌ నిలిచిపోయే సమయం కంటే ఉత్పత్తిపై పడుతున్న ప్రభావమే ఎక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమలకు భారీ నష్టం..

పరిశ్రమల్లో యంత్రాలు నిరంతరాయంగా పనిచేస్తేనే ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది. తరచూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో యంత్రాల పనితీరు దెబ్బతినడమే కాకుండా, ఉత్పత్తికి కేటాయించిన సమయం వృథా అవుతోంది. కార్మికుల పని ప్రణాళికలు కూడా అస్తవ్యస్తమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో భారీ నష్టాలు ఎదురవుతున్నాయని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం పారిశ్రామిక వర్గాలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉత్పత్తి కార్యకలాపాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకునే అవకాశం లేకుండా పోతోంది.

సమస్యలు పరిష్కరిస్తేనే..

పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపైనా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్‌ అంతరాయాలను తగ్గించి, సాంకేతిక సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో విద్యుత్‌ అంతరాయానికి గల కారణాలను గుర్తించి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.