Gadwal Fort 
తెలంగాణ

గద్వాల గడ్డ రాజసం.. కోట గోడల్లో సాహితీ వైభవం

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం సంస్థానం

B. Suresh

ప్రభాత ఉదయం, జోగులాంబ గద్వాల:  పరాక్రమం.. సాహిత్యం.. కళలు.. సంప్రదాయాలను తనలో దాచుకున్న గద్వాల సంస్థానం దక్షిణ తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నేటి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంగా ఉన్న గద్వాల పట్టణం ఒకప్పుడు సంస్థాన రాజధానిగా వెలుగొందింది. సోమనాద్రి అలియాస్ పెద్ద సోమ భూపాలుడి కాలంలో కోట నిర్మాణం, సంస్థాన విస్తరణకు బలమైన పునాది పడింది.

చారిత్రక ఆధారాల ప్రకారం నల సోమనాద్రి 1663లో పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గద్వాలను ప్రధాన కేంద్రంగా చేసుకొని కోటను అభివృద్ధి చేశారు. సంస్థాన పరిధి గద్వాల, అలంపూర్‌తో పాటు కర్నూలు, కర్ణాటక ప్రాంతాల వరకు విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. గద్వాల కోటలో చెన్నకేశవ స్వామి ఆలయం సహా పలు  పురాతన కట్టడాలు ఉన్నాయి. నేటికీ కోట గోడలు అలనాటి వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి.

విద్వత్ గద్వాలగా గుర్తింపు

గద్వాల రాజవంశ చరిత్రలో పెద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, స్వర్గారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి తదితర పేర్లు కనిపిస్తాయి. వీరి పరిపాలన కాలం 1553 నుంచి 1704 మధ్య ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం నల సోమనాద్రి కాలంలో గద్వాల సంస్థానం శక్తివంతమైన సామంత రాజ్యంగా మారింది.  ఈ సంస్థానం యుద్ధాలు, పాలనకే పరిమితం కాలేదు. తెలుగు, సాంస్కృతిక, సాహిత్యాన్ని ప్రోత్సహించింది. అందుకే గద్వాలకు విద్వత్ అనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సాహిత్య సభలు, పండితుల ఆదరణ, కళలకు  ప్రోత్సాహం సంస్థాన సాంస్కృతిక వైభవాన్ని పెంచాయి.

తిరుమల శ్రీవారికి జోడు పంచెలు

గద్వాల చరిత్రలో మరో విశిష్ట సంప్రదాయం తిరుమల వెంకటేశ్వర స్వామికి జోడు పంచెలు సమర్పించడం. ఇక్కడి జరీ వస్త్రాలకు ఉన్న ప్రాచుర్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ధరింపజేసేందుకు పట్టు వస్త్రాలను గద్వాల సంస్థానాన్ని కోరినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతుండటం విశేషం.

రాజరిక పాలనకు ముగింపు

నిజాం హైదరాబాద్ రాజ్యంలో గద్వాల ఒక సామంత సంస్థానంగా కొనసాగింది. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం కావడంతో 1948లో గద్వాల సంస్థాన పాలనకు ముగింపు పలికినట్లయింది. చివరి పరిపాలకురాలిగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. సీతారామ భూపాలుడు 1924లో మరణించిన అనంతరం ఆమె పాలనాపగ్గాలు చేపట్టి.. భారత యూనియన్‌లో విలీనం అయ్యేవరకు కీలక పాత్ర పోషించారు. వారసులు లేకపోవడంతో తన కుమార్తె వరలక్ష్మీదేవి కుమారుడు కృష్ణ రాంభూపాల్‌ను దత్తత తీసుకొని వారసుడిగా చేశారు. రాజరిక పాలన ముగిసిపోయినా గద్వాల రాజవంశం వారసులు నేటికీ తమ కుటుంబ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. రాజ్యం పోయినా చరిత్ర మాత్రం గద్వాల గడ్డపై సజీవంగానే ఉంది.

కోట ద్వారం
గద్వాలలో అలనాటి ఫిరంగి
కోటలో కోనేరు