తెలంగాణ

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌కు ఎంపీ నిధులు

ప్రజాధనం వృథాపై మున్సిపల్ వాసుల ఆగ్రహం

Ranjith

ప్రభాత ఉదయం, సిద్దిపేట: ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించింది. కానీ గజ్వేల్ ప్రజాభవన్ మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. 2019 ఎన్నికల ముందు ప్రతీ నెల ఒక రోజు క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఏ ఒక్క రోజూ క్యాంపు ఆఫీస్‌లో కాలుమోపలేదు. ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచే పార్టీ నేతలతో మాట్లాడుతుండటంతో క్యాంపు కార్యాలయం కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో కొత్త నిర్మాణాలకుగాను ఎంపీ లాడ్ నుంచి నిధులు కేటాయించడం విస్తుగొలుపుతోంది.

అదనపు నిర్మాణాలకు రూ.20 లక్షలు

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభమైన నాటి నుంచి ఏ ఒక్క రోజు కాలు పెట్టని కేసీఆర్ కాన్ఫరెన్స్ హాల్, భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావు ఒక్కొక్కరు రూ.50 లక్షల చొప్పున రూ.1.50 కోట్లు గజ్వేల్ మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల నుంచి కాన్ఫరెన్స్ హాల్, భోజనశాల నిర్మాణానికి రూ.20 లక్షలు వెచ్చించనున్నారు. ఈ నిర్మాణాల విషయమై ఇటీవలే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో  బీఆర్ఎస్ మున్సిపల్ నేతలతో చర్చించడం గమనార్హం. ఏ ఒక్క రోజూ క్యాంపు కార్యాలయానికి వెళ్లని కేసీఆర్ మరిన్ని హంగులు అద్డడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.