రాష్ట్రంలో రానున్న వేసవి విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా జెన్కో కసరత్తు ప్రారంభించింది. యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (వైటీపీఎస్)లోని ఐదో యూనిట్లో డిసెంబర్ నుంచి సరఫరాను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. గత అక్టోబర్ 20న ఈ యూనిట్ ట్రయల్ రన్ కూడా విజయవంతంగా ముగించారు. అనంతరం బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులు సంయుక్తంగా నిర్వహించిన పరిశీలనలో దాదాపు 600 సాంకేతిక సమస్యలను గుర్తించారు. వాటిని ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని జెన్కో సీఎండీ అధికారులను ఆదేశించారు.
సాంకేతిక లోపాలపై దృష్టి
మరోవైపు మిగిలిన నాలుగు యూనిట్లలోనూ పూర్తిస్థాయి ఉత్పత్తికి ఆటంకంగా మారిన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు దృష్టిసారించారు. బొగ్గు సరఫరాకు కీలకమైన కన్వేయర్ బెల్టుల మరమ్మతులను చేపట్టనున్నారు. ప్రస్తుతం వానాకాలం ముగియడం, రబీలో ఆరుతడి పంటల వైపే రైతులు మొగ్గు చూపేలా ప్రభుత్వం సూచించడంతో ప్రస్తుతానికి వ్యవసాయ డిమాండ్ కొంత తగ్గింది. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అవసరాన్ని బట్టి యూనిట్లను షట్‌డౌన్ చేసి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
బొగ్గు సరఫరాకు లైన్ క్లియర్
ఈ ప్లాంట్‌కు అవసరమైన జీ-9 రకం నాణ్యమైన బొగ్గు సరఫరా లేకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి ఒక కారణం. అయితే, మొత్తం ఐదు యూనిట్లకు అవసరమైన బొగ్గును కేటాయించేందుకు కోల్ ఇండియా నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. మరో వారంలో బొగ్గు రవాణా ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో వేసవి ప్రారంభమయ్యే నాటికి ఐదు యూనిట్లనూ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా విద్యుత్‌శాఖ అడుగులు వేస్తోంది.