వారంతా ఊరికి దూరంగా విసిరివేయబడ్డ అభాగ్యులు.. తరతరాలుగా బానిసలుగా బతుకుతున్న బడుగుజీవులు.. రెక్కాడితే కానీ డొక్కనిండని నిరుపేదలు.. సామాజిక వెనుకబాటులో అగ్రభాగాన్ని అందిపుచ్చుకున్న దళితులు.. అయితే, వారి దీనస్థితిని గమనించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దయతలచి వారికి భూములిచ్చింది.. కానీ, బతుకుదెరువు కోసం పక్క గ్రామానికి వెళ్లడమే వారికి శాపంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. వారి స్థిరనివాసాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లడంతో ఇక్కడ వారికి సర్కారు ఇచ్చిన భూమిలోకి వెళ్లలేని దుస్థితి దాపురించింది.. సాగుచేసుకోవాల్సిన నేలలో అడుగుపెట్టడమే నేరంగా మారింది.. ఆదుకోవాల్సిన అధికారమే.. ‘గెట్ అవుట్’ అంటూ గెంటివేస్తుండటంతో ఎక్కడికి వెళ్లాలి.. ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లా మధిర మండలం ఎండపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రభాత ఉదయం, ఖమ్మం: ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులూ మారుతున్నారు. అభివృద్ధి పేరుతో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. కానీ, దళితుల జీవన ముఖచిత్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నది. ఖమ్మం జిల్లా మధిర మండలం ఎండవల్లి గ్రామంలో బంజరు భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ, వారసత్వంగా ప్రొవిజినల్ పట్టాలు పొందినప్పటికీ హక్కులు లేవంటూ దళితులను ‘అధికార’ యంత్రాంగం వెళ్లగొట్టడం విస్తుగొలుపుతోంది.
1986లో ప్రొవిజినల్ పట్టాలు!
అల్పాదాయం కారణంగా పస్తులతో సహవాసం చేస్తున్న దళితవర్గాలకు 1986లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సర్కార్ బాసటగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 151 దళిత కుటుంబాలకు 89 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. మధిర మండలం, ఎండపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 62, 73, 74 సర్వే నంబర్లలోని బంజర భూమిని ఒక్కొక్కరికి 16 గుంటల చొప్పున కేటాయించింది. అంతకుమునుపే లబ్ధిదారులు ఆయా భూములపై పొజిషన్లో ఉన్నందున ప్రొవిజినల్ పట్టాలు జారీ చేశారు. భూస్వాధీన హక్కులు లభించినప్పటికీ, సాగునీటి వసతి లేనందున దళితులు కంది, పెసర, మినుములు, జొన్న వంటి పంటలను పండించుకొని జీవనోపాధిని పొందుతూ వచ్చారు.
రోగాలకు భయపడి పొరుగూరికి వెళ్లి..
భూ పట్టాలు పొందిన దళితుల పూర్వీకులు మధిర మండలం ఎండవల్లి గ్రామానికి చెందినవారే. ఊరికి దూరంగా ఒక సమూహంలో జీవిస్తున్న వారిని కలరా మహమ్మారి అక్కడి నుంచి తరిమింది. సరైన మందులు లేక, టీకా వేసే నాథుడు కనిపించక పొరుగునే ఉన్నటువంటి (2 కిలో మీటర్ల దూరం) కృష్ణాజిల్లా దుందిరాలపాడుకు బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, తాము సాగు చేసుకుంటున్న భూములను తమకే ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చారు. వారి మొర ఆలకించిన దివంగత సీఎం ఎన్టీఆర్ పట్టాలు జారీ చేయడం గమనార్హం.
కోర్టు వివాదాలతో ఇక్కట్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హయాంలో ప్రొవిజినల్ పట్టాలు పొందిన దళితులకు కోర్టు వివాదాలు, రాష్ట్ర విభజన వంటి అంశాలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఒకేసారి 89 ఎకరాల బంజర భూమి దళితులకు దక్కడం జీర్ణించుకోని స్థానిక ఓ పెద్దమనిషి వివాదానికి ఆజ్యం పోశాడు. పట్టాలు పొందిన భూమిలో తన సొంత స్థలం కలిసిందని హైకోర్టులో పిటిషన్ వేశాడు. అక్కడ కేసు కొనసాగుతుండగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో లబ్ధిదారులైన దళితుల స్వగ్రామమైన దుందిరాలపాడు కృష్ణా జిల్లాలో ఉన్నందున ఆంధ్ర ప్రాంతానికి కేటాయించారు. హైకోర్టు కేసు, ప్రాంతేతరులు అన్న సాంకేతిక కారణాలతో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ సర్కారు వారికి పట్టాదారు పాసు బుక్కులు జారీ చేయలేదు.
స్టేటస్ కో ఉత్తర్వులు
స్థానికేతరులు, హైకోర్టు కేసును బూచీగా చూపెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసైన్డ్ పట్టాల జారీ ప్రక్రియను నిలిపివేసింది. రెవెన్యూ రికార్డులలో దళితుల పేర్లు వస్తున్నందున 2016లో ఆర్డీవో ద్వారా నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలతో జాయింట్ కలెక్టర్ కోర్టులో హాజరై రాతపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు. లబ్ధిదారులంతా వెళ్లి విషయం చెప్పుకున్నప్పటికీ పక్క రాష్ట్రం, పొరుగు జిల్లాకు చెందిన వారు అనే కారణంతో పట్టాలు క్యాన్సిల్ చేస్తున్నట్టు నాటి కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారికంగా ఏకపక్ష ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. వాటిని సవాల్ చేస్తూ దళితులు మరోసారి హైకోర్టుకు వెళ్లగా.. స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది.
ఇండస్ట్రియల్ పార్క్‌తో మరో దెబ్బ
మధిర ప్రాంత అభివృద్ధి పేరుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇండస్ట్రియల్ పార్క్‌ను మంజూరు చేయించారు. దానికి 2024 మార్చి నెలలో మధిర మండలం ఎండపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 62, 73 సర్వే నంబర్లలో ఉన్నటువంటి 84.26 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అవే సర్వే నంబర్లలో దళితులు పట్టాలు పొందిన భూములు ఉన్నందున వివాదం మొదలైంది. అధికారం కనుసైగలతో రంగంలోకి దిగిన బడా కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి దళితుల భూముల్లో సైతం రోడ్ల నిర్మాణం చేపట్టారు. పక్కనే కొనసాగుతున్నటువంటి జాతీయ రహదారులకు సైతం ఆయా భూముల్లో నుంచి మట్టి తోలకాలు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న దళిత కుటుంబాలన్నీ వెళ్లి ఆందోళనకు దిగాయి.
పోలీసులతో నిర్బంధం
ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టడం సరికొత్త వివాదానికి తెరలేపింది. హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ హడావుడిగా, ఏకపక్షంగా శంకుస్థాపన చేయడం ఏమిటనేది ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న సమస్య. ఆరోజున తమ గోడును విన్నవించేందుకు వెళుతుండగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయించి అడ్డుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ‘పొరుగు రాష్ట్రంలోకి వెళ్లిన మీకు ఇక్కడ ఎలాంటి హక్కులు లేవని’ అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. కోర్టు నుంచి అనుమతులు తీసుకొస్తే భూములు ఇస్తామని రెవెన్యూ అధికారులు మరో విధంగా చెప్పడం బాధితులను అయోమయానికి గురిచేస్తున్నది. ప్రాంతాలు వేరైనప్పటికీ, ప్రభుత్వాలు మారినప్పటికీ పేదలకు సంక్షేమ ఫలాలు దక్కకుండా చేయడం సరికాదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా దళిత కార్డుతో డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్న భట్టి విక్రమార్క, దళితులకే భూములు దక్కకుండా చేస్తున్నారనే విమర్శను మూటకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం స్థానం తీర్పు ఎప్పుడు వస్తుందో? బంజరు భూములు ఎవరికి దక్కుతాయో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
మా భూమి మాకివ్వాలి
నాకు ఎక్కడా గుంట భూమి లేదు. ఇప్పటికీ కూలి చేసుకొని బతుకుతున్నా. 40 ఏళ్ల కింద ప్రభుత్వం ఇచ్చిన కాస్త భూమి ఇప్పుడు లేదంటున్నారు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. నా దీనస్థితిని అర్థం చేసుకొని పట్టాలో ఉన్న భూమిని ఇవ్వాలని చేతులెత్తి మొక్కుతున్నా.
- దారెల్లి నాగరత్నం
జీవనాధారాన్ని లాక్కోవడం అన్యాయం
మా తాత ముత్తాతల నుంచి ఎండవల్లి గ్రామంలో బంజరు భూమిని సాగు చేసుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పట్టాలు ఇప్పుడు చెల్లవని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం. రాష్ట్రం విడిపోక ముందు దళితులుగా ఉన్న మేము ఇప్పుడు కాదా? కొద్దిపాటి జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కోవడం న్యాయం కాదు. అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి.
- దారెల్లి వెంకటేశ్వర్లు
మా పట్టా భూముల నుంచి తరిమేస్తున్నారు
ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మా పట్టా భూముల నుంచి మమ్మల్ని తరిమేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా భూముల్లో అడుగుపెడితే రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి 144 సెక్షన్ అమలులో ఉందని మెడలుపట్టి బయటకు నెడుతున్నారు. కోర్టు తీర్పు వచ్చేవరకు ఆగాలని ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదు.
- గంధం వెంకటేశ్వర్లు
మాకు కోర్టులకెళ్లే స్థోమత లేదు
మా భూమి మాకు ఇవ్వాలని ఎమ్మార్వో గారిని అడిగితే కోర్టుకెళ్లి తెచ్చుకోమంటున్నారు. కోర్టులకు వెళ్లే స్థోమత మాకు లేదు. రోజు కూలీకి వెళ్లకపోతే ఇల్లు గడవదు. మారాజులు పెద్దమనుసు చేసుకుని న్యాయం చేయాలని చేతులెత్తి మొక్కుతున్న.
- మడిపల్లి కస్తూరి