ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ‘భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేది మీరే.. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేదీ మీరే.. మళ్లీ వాటిని కూల్చివేయాలని కోరేదీ మీరేనా?’ అంటూ జీహెచ్‌ఎంసీ తీరును హైకోర్టు ప్రశ్నించింది. లేఅవుట్లను క్రమబద్ధీకరించి, అందులోని పబ్లిక్ స్థలాలను రక్షించాలంటూ రెవెన్యూ శాఖను, హైడ్రాను ఎందుకు ఆశ్రయిస్తున్నారని నిలదీసింది. చట్టబద్ధమైన సంస్థగా జీహెచ్‌ఎంసీయే చర్యలు తీసుకోకుండా, తన స్థలంలోని నిర్మాణాల తొలగింపునకు రెవెన్యూ శాఖను సంప్రదించడం ఏమిటని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలోని డిఫెన్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పరిధిలోని ప్లాట్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా చట్టవిరుద్ధంగా కూల్చివేస్తోందంటూ నరసింహారెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అదే సొసైటీకి చెందిన 112 ఎకరాల్లో భాగమైన 6,039 చదరపు గజాల్లో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డు నిర్మాణాలు చేపట్టడాన్ని, చెత్త తరలించే వాహనాలను పార్క్ చేయడాన్ని సవాల్ చేస్తూ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ శుక్రవారం విచారణ చేపట్టారు.
నోటీసులకు సమాధానం ఇచ్చినా ఎలా కూల్చేస్తారు?
అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టామని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ కూడా జరిగిందని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అక్రమ నిర్మాణాలంటూ జారీ చేసిన నోటీసులకు పిటిషనర్లు సమాధానం ఇచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పకుండా ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించారు.
బహిరంగ ప్రదేశాల రక్షణ బాధ్యత మీదే
లేఅవుట్‌తో సహా అనుమతులన్నీ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ, పబ్లిక్ ప్రదేశాలను పరిరక్షించేందుకు తిరిగి రెవెన్యూ అధికారులను, హైడ్రాను ఆశ్రయించడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. సొసైటీ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతలతోపాటు డంపింగ్ యార్డు నిర్మాణాలు, వాహనాల పార్కింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.