మీడియాతో మాట్లాడుతున్న హరీశ్‌రావు 
తెలంగాణ

మంచిరేవుల, మియాపూర్‌ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించు: రేవంత్‌కు హరీశ్‌ సవాల్‌

మంచిరేవుల, మియాపూర్ భూ వివాదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్:  ‘‘మంచిరేవుల, మియాపూర్ భూ దందాపై దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు రేవంత్‌రెడ్డి’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీశ్‌రావు సవాలు విసిరారు. ‘‘అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది ఆయనకే దక్కుతుందని, అబద్ధానికి అంగీ, లాగు తొడిగితే అచ్చం రేవంత్‌రెడ్డి లెక్కే ఉంటది’’ అని ఎద్దేవా చేశారు. ‘‘వంటంతా మేము వండితే, చివర్లో గంట తిప్పి నేనే వండినా అంటున్నారు. ఇది ఓటుచోరీ కాదు, పక్కా క్రెడిట్ చోరీ’’ అని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ చేతికి రాకముందే మియాపూర్ భూములు అమ్మేయాలంటూ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ‘‘ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నవ్ రేవంత్‌రెడ్డీ?’’ అని నిలదీశారు.

మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమి కేసు 2010లో కాంగ్రెస్ హయాంలో ఓడిపోయిందని గుర్తుచేశారు. అప్పుడు ఏజీని కోర్టుకు పంపకుండా చిన్న జీపీని పంపి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత 2017 మే 19న కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతమైన న్యాయవాదులను నియమించామని, తిరిగి 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. 142 ఎకరాలు ప్రభుత్వానివేనని 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిందని, అప్పుడు ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు.

కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని గెలిపించింది తామేనని, కానీ ఇప్పుడు తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 30 ఏళ్ల గ్రేహౌండ్స్ ప్రహరీని రాత్రికి రాత్రే కూల్చేశారని, రెండు రోజుల్లో లోపలికి కొత్త గోడ కట్టడానికి టెండర్ ఎవరిచ్చారని ప్రశ్నించారు. పది ఎకరాల పది గుంటల భూమిని ప్రయివేట్ వ్యక్తులకు వదిలేశారని, గండిపేట ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ నం.8886/2026 జీరో వాల్యూ రిజిస్ట్రేషన్ చేశారని, మార్కెట్ విలువ రూ.45.39 కోట్లు, కన్సిడరేషన్ వాల్యూ సున్నా అని, అలా 7.5 శాతం ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజులో ఒక్క రూపాయి కూడా కట్టలేదని, డ్రీమ్ వ్యాలీ సంతోష్‌రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, ఆ వెంటనే మరో 20 రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయని వివరించారు.

ఎకరం రూ.100 కోట్లు పలికే చోట రూ.వెయ్యి కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారని ఆరోపించారు. ‘‘భూభారతిలో ఈ రోజుకూ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు మీదే ఉందని, ముఖ్యమంత్రి కనుసన్నల్లో కాకపోతే గ్రేహౌండ్స్ గోడ కూల్చే దమ్ము ఎవరికి ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన మరో పది ఎకరాల భూమి నోటిఫికేషన్ రద్దు అప్పీల్‌కు వెళ్లలేదని, జడ్జిపేర 134లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వొచ్చని రాసినా మూడు నెలలుగా కదలిక లేదని ధ్వజమెత్తారు. మంచిరేవులలో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సోదరుడిని జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దానికి కారణమైన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను కేసీఆర్ అదేరోజు సస్పెండ్ చేశారని చెప్పారు. 2016 జూన్ 1న జీవో 45తో జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించామని చెప్పారు. మియాపూర్ కేసు సుప్రీంకోర్టులో 192 సార్లు విచారణకు వచ్చిందని, అందులో 86 సార్లు వాదించింది బీఆర్ఎస్ నియమించిన సీనియర్ న్యాయవాది  వైద్యనాథన్ అని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక 11 విచారణలు మాత్రమే జరిగాయన్నారు. మియాపూర్ తీర్పుకు కారణం 2023లో తాము గెలిచిన ట్రినిటీ తీర్పులోని అంశమేనని చెప్పారు. భూపాలపల్లి అటవీ భూముల కేసును టీడీపీ, కాంగ్రెస్ 20 ఏళ్లపాటు పట్టించుకోలేదని ఆరోపించారు. 2021లో అక్రమార్కులను అరెస్టుచేసి జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. భూమి కట్టబెట్టే ఉద్దేశమే ఉంటే వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తాం? అని ప్రశ్నించారు. ఎస్ఎల్పీ 6937/2021 దాఖలు చేసి మూడేళ్లు పోరాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, 2024 ఏప్రిల్ 18న తీర్పును అధికారంలోకి వచ్చి మూడు నెలలకే రేవంత్ గెలిచారా? అన్నారు. ఐఎంజీ బిల్లీరావుకు ఎకరం రూ.50 వేలు చొప్పున 850 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబేనని, అప్పుడు ఆ టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు. ఐఎంజీ కేసులో 9 ఏళ్లు పోరాడింది బీఆర్ఎస్, తీర్పు వచ్చింది 2024 మార్చి 7న అని వివరించారు. కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికి, జింకలను ఆగం చేసినందుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో కుదువపెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.