ప్రభాత ఉదయం, వనపర్తి : కాంగ్రెస్ పాలన పాలమూరు రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో పంట పొలాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 8 ఏళ్ల పాటు కల్వకుర్తి ఎత్తిపోతల కింద రైతులు రెండు పంటలు సాగు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని పునరుద్ఘాటించారు. శ్రీశైలంలో 221 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఇప్పుడు నీళ్లు వదిలినా కొంత పంట కాపాడుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే పక్క రాష్ట్రానికి కృష్ణా నీళ్లు పరుగులు తీస్తున్నాయని విమర్శించారు. 700 కిలో మీటర్లు ఉన్న కుప్పంకు కృష్ణా నీళ్లు వెళ్లాయని తెలిపారు. కేఎల్‌ఐకి ఐదు మోటర్లు ఉంటాయని, అన్ని మోటర్లు ఆన్ చేస్తే ప్రతి రోజు 4 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తాయని తెలిపారు. ఇలా ఐదు నెలల్లో 50 టీఎంటీల నీళ్లు ఎత్తి పోసుకోవచ్చని చెప్పారు. కానీ, 18 టీఎంసీలు మాత్రమే ఎత్తి పోశారని విమర్శించారు. 2019 కరోనా కాలంలో కేసీఆర్ 50 టీఎంసీల నీరు ఎత్తి పోసి రెండు పంటలకు సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. జూరాలలో 252 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచి 9,600 క్యూసెక్కుల నీటిని వాడుకోవచ్చని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని, 20 శాతం పనులు చేయలేక సాగునీరు ఇవ్వడం లేదన్నారు. నీళ్లు, కరెంట్ ఇవ్వని రేవంత్ రెడ్డికి సెలవు ఇప్పిద్దామని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను అమలు చేయలేక కాంగ్రెస్ వాటిని రద్దు చేసిందన్నారు. కరువు మండలాలుగా ప్రకటించి ఎలాంటి సాయం చేయకుండా రైతులు, కూలీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో పని దినాలు పెంచి కూలీలను ఆదుకుంటున్నారని చెప్పారు. మియాపూర్‌లో 500 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్ముతానని సీఎం చెబుతున్నాడని, వాటి నుంచి వచ్చే కమీషన్‌కు ఆశపడుతున్నాడని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ కేంద్ర బృందం పర్యటించికపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.