ప్రభాత ఉదయం, సిద్దిపేట: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక దీక్షలకు గురువారం సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇవ్వడమే కాకుండా ఎన్హెచ్ఎం, ఆయుష్, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాయ్ తాగినంత సమయంలోనే సర్వశిక్షా అభియాన్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి చాయ్ తాగడం లేదా? చాయ్ తాగినప్పుడు ఇచ్చిన హామీ గుర్తుకు రావడం లేదా అని ఎద్దేవా చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు రావాల్సిన ఉద్యోగులకు 15వ తేదీ వచ్చినా జీతాలు అందడం లేదన్నారు. ఒక్కోసారి రెండు, మూడు నెలలు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించారని గుర్తు చేశారు. మాటలు చెప్పడం కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు న్యాయం చేయని పక్షంలో బీఆర్ఎస్ అండగా ఉండి న్యాయమైన డిమాండ్ల సాధనకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.