ప్రభాత ఉదయం, నర్సాపూర్ : కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగా లేక, సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా మార్పు అంటే అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వందలాది ఎకరాల్లో పంటలు కోల్పోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు పర్యటించారు. చిలప్చేడ్ మండలం ఫైజాబాద్, గంగారం గ్రామాల్లో పంటపొలాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము పంటలు నష్టపోయామంటూ రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామాల్లో ఎవరికీ రుణమాఫీ కాలేదని, ఇప్పుడు చేతికందాల్సిన పంటలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సకాలంలో కరెంటు అందక నాకున్న ఏడెకరాల పొలం ఎండిపోయింది’ అంటూ ఓ రైతు హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రైతును ఓదార్చిన అనంతరం హరీశ్ మాట్లాడుతూ, ఎండిన ప్రతి ఎకరాకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుబంధు, పూర్తి స్థాయి రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ సర్కారును వదిలిపెట్టబోమని హెచ్చరించారు.