ప్రభాత ఉదయం, హైదరాబాద్ : భద్రాచలం గోదావరి ఇసుక మేటల వద్ద పర్యాటకుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఇసుక మేటల వద్ద భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని జస్టిస్ నగేశ్ భీమపాక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున హోంశాఖ న్యాయవాది మహేశ్ రాజే, రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది హాజరై అధికారుల నుంచి తీసుకున్న వివరాలను ధర్మాసనానికి సమర్పించారు. ఆ వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్కోషి, జస్టిస్ చలపతిరావులతో కూడిన ధర్మాసనం ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. మార్చి 20న ఉగాది సందర్భంగా భద్రాచలం ఇసుక మేటలను అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు విద్యార్థులు సందర్శించారు. ఈ క్రమంలో ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా జస్టిస్ నగేశ్ భీమపాక మార్చి 25న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతంలోని ఇసుక మేటల వద్ద భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.