హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్, మక్కా మసీదు, హుస్సేన్‌సాగర్ మాత్రమే కాదు.. నగరంలోని ప్రతి వీధి, ప్రతి ప్రాంతం వెనుక ఒక చరిత్ర ఉంది. నేడు నిత్యం మన నోట పలికే అబిడ్స్, బేగంపేట, ఖైరతాబాద్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, సుల్తాన్‌బజార్ వంటి పేర్లకు వందల ఏళ్ల నాటి కథలు ముడిపడి ఉన్నాయి. కొన్ని పేర్లు రాజులు, నవాబులు, బేగంల నుంచి వస్తే.. మరికొన్ని మార్కెట్లు, వృత్తులు, కోటలు, సైనిక శిబిరాలు, నీటి వనరుల నుంచి పుట్టాయి. ఇంతకీ.. హైదరాబాద్ ప్రాంతాల పేర్ల వెనుక అసలు కథేంటి?
అబిడ్స్
నేడు హైదరాబాద్‌లోని ప్రముఖ వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన అబిడ్స్ పేరు వెనుక ఆల్బర్ట్ అబిడ్ అనే యూదు వ్యాపారికి సంబంధించిన కథనం ప్రచారంలో ఉంది. నిజాం కాలంలో ఆయనకు చెందిన వ్యాపార సంస్థ చుట్టుపక్కల ప్రాంతానికి ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందని స్థానిక చరిత్ర కథనాలు చెబుతున్నాయి. కాలక్రమంలో ఆ ప్రాంతమే ‘అబిడ్స్’గా స్థిరపడింది.
అంబర్‌పేట
హైదరాబాద్‌లోని చారిత్రక ప్రాంతాల్లో అంబర్‌పేట ఒకటి. హైదరాబాద్ నగరం ఏర్పడకముందే జీవం పోసుకున్న అంబర్‌పేట ప్రాంతంలో ఉనికిలో ఉండేది. అంబర్, పేట అనే రెండు పదాల కలయికతో అంబర్‌పేట ఏర్పడింది. అంబెర్గీస్ అనేది పర్షియన్ భాష కాగా, పేట అనే పదానికి ఉర్దూ భాషలో ప్రాంతం అని అర్థం. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాదారుడైన ప్రసిద్ధ సుఫీ సన్యాసి అంబర్ బాబా పేరుమీదుగా ఈ ప్రాంతానికి అంబర్‌పేట అనే పేరు పెట్టడం జరిగింది. కమ్మటి వాసనలతో నోరూరించే పండ్ల తోటలు, సువాసనలతో మత్తెక్కించే సంపెంగ, మల్లె, మందార పూలతోటలకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది.
ఖైరతాబాద్
రాష్ట్ర పరిపాలనకు గుండె కాయ లాంటి సచివాలయం, గవర్నర్ నివసించే రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివసించే ప్రగతి భవన్, అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అతిథి గృహాలు ఖైరతాబాద్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఖైరతాబాదులో నిర్వహించే గణేష్ ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోనే విశేష ప్రాచుర్యం పొందాయి. ఖైరతాబాదుకు ఆ పేరు రావడం వెనుక పెద్ద చరిత్ర ఉంది. హైదరాబాద్ ను పాలించిన కులీ కుతుబ్ షా కుమార్తె ఖైరతున్నీసా బేగం తీవ్ర అస్వస్థతకు గురైన సమయంలో వైద్యుల సూచనతో ఆమెను ఆహ్లాదకర వాతావరణంలో ఉంచే నిమిత్తం నౌబత్ పహడ్ (బిర్లామందిర్) ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడే ఖైరతున్నీసా ఆరోగ్యం కుదటపడింది. మరణానంతరం కూడా తన భౌతిక దేహాన్ని అక్కడే సమాధి చేయాలని కోరుకుంది. ఇందుకోసం ఆమె బతికి ఉన్నప్పుడే ఒక టూంబ్ నిర్మించుకున్నారు. ఖైరుతున్నీసా బేగం టూంబ్ పేరిట కాలక్రమేణా ఈ ప్రాంతం పేరు ఖైరతాబాద్ గా స్థిరపడింది. అయితే ఆమె హజ్ యాత్రకు వెళ్లి అక్కడే కాలం చేయడంతో టూంబ్లో సమాధి చేయలేకపోయారు.
ముషీరాబాద్
కుతుబ్ షాహి కాలంలో నిర్మించిన ప్రాంతం ముషీరాబాద్. ఇక్కడి మసీదు, పరిసర ప్రాంతాలను నవాబ్ అరస్తు జా..అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి ముషీర్-ఉల్-ముల్క్ కు ఇచ్చారు. అంతేకాకుండా అతని గౌరవార్థం ముషీరాబాద్ ఆ ప్రాంతానికి ముషీరాబాద్ అనే పేరు పెట్టారు. ముషీరాబాద్ మసీదును కుతుబ్ షాహి రాజవంశపు నాలుగో సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించారు.
సికింద్రాబాద్
మూడో నిజాం హయంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్‌లో ఈస్టిండియా కంపెనీ కాలు మోపింది. క్రమంగా బ్రిటిష్ అధికారులు, సైనిక పటాలాలు, స్థానికుల నివాసాలు పెరగటంతో అక్కడ తమకు ప్రత్యేకంగా నగరం ఏర్పాటుకు స్థలం చూపాలని నాటి బ్రిటిష్ రెసిడెన్సీ థామస్ సైడన్‌హామ్.. మూడో నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జాకు లేఖ రాశాడు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఉన్న స్థలాన్ని కేటాయిస్తూ దానికి తన పేర సికింద్రాబాద్ అని నామకరణం చేశాడు. అలా 1806లో సికింద్రాబాద్ ఆవిర్భవించింది.
బేగంపేట
విమానాశ్రయం, వాణిజ్య కేంద్రాలు, కార్యాలయాలతో నేటి ఆధునిక హైదరాబాద్‌లో కీలక ప్రాంతంగా ఉన్న బేగంపేటకు కూడా ఓ రాజకుటుంబ నేపథ్యం ఉంది. నిజాం కుమార్తె బషీరున్నిస్సా బేగంకు వివాహ సమయంలో ఇచ్చిన భూములతో ఈ ప్రాంతం పేరు ముడిపడి ఉందని చారిత్రక కథనం. ఆమెకు లభించిన భూముల కారణంగా ఆ ప్రాంతం ‘బేగంపేట’గా పిలవబడిందని చెబుతారు.
నాంపల్లి
నాంపల్లి పేరు వినగానే రైల్వే స్టేషన్, ఎగ్జిబిషన్, నగరంలోని రద్దీ ప్రాంతం గుర్తుకొస్తాయి. కానీ ఈ పేరుకు వెనుక ఉన్న కథ మాత్రం నిజాం కాలానికి వెళ్తుంది. రాజా అలీ ఖాన్ అనే వ్యక్తికి ‘నేక్‌నామ్ ఖాన్’ అనే బిరుదు ఉండేదని, ఆయనకు లభించిన జాగీర్ ‘నేక్‌నాంపల్లి’గా పిలవబడి, కాలక్రమంలో ‘నాంపల్లి’గా మారిందని ఒక చారిత్రక కథనం చెబుతోంది.
బేగంబజార్
హైదరాబాద్‌లోని అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో బేగంబజార్ ఒకటి. హైదరాబాద్ రెండో నిజామ్ పాలకుడైన అస్సాఫ్ జా-II (నిజాం అలీ ఖాన్) భార్య హమ్దా బేగం వర్తక వాణిజ్యాల ప్రోత్సాహార్థం ఈ ప్రాంతాన్ని నగర వ్యాపారులకు బహుమతిగా సమర్పించారు. తదనంతర కాలంలో ఈ ప్రాంతం అతిపెద్ద వర్తక, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఆమె గౌరవార్థం ఈ ప్రాంతానికి 'బేగంబజార్' అనే పేరు స్థిరపడింది.
అఫ్జల్‌గంజ్
నేడు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటైన అఫ్జల్‌గంజ్ ఒకటి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, హైకోర్టు, సాలార్ జంగ్ మ్యూజియం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఐదో నిజాం రాజైన అఫ్జల్ ఉద్ దౌలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు ఈ ప్రాంత భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయన గౌరవార్ధం ఈ ప్రాంతానికి అఫ్జల్‌గంజ్ పేరు పెట్టారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. ‘గంజ్’ అంటే మార్కెట్ లేదా వాణిజ్య కేంద్రం అనే అర్థం ఉంది.
సుల్తాన్‌బజార్
హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ అత్యంత ప్రసిద్ధ, పురాతన వాణిజ్య, షాపింగ్ మార్కెట్ ప్రాంతం. సుల్తాన్‌బజార్‌ను ఒకప్పుడు రెసిడెన్సీ బజార్‌గా పిలిచే వారు. బ్రిటిష్ రెసిడెన్సీ ఆధీనంలోని ప్రాంతాలు తిరిగి నిజాం పాలనలోకి వచ్చిన తర్వాత సయ్యద్ సుల్తానుద్దీన్ నవాబ్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ‘సుల్తాన్‌బజార్’ అనే పేరు పెట్టారు.
బంజారాహిల్స్
నేడు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ పేరు మాత్రం ఒకప్పుడు ఈ ప్రాంతంతో ముడిపడిన బంజారా సమాజం నుంచి వచ్చిందని ప్రచారంలో ఉంది. ఆ ప్రాంతంలో బంజారాలు నివసించేవారని, తరువాత కాలంలో నగరం విస్తరించడంతో ఈ కొండ ప్రాంతం ఆధునిక హైదరాబాద్‌లో భాగమైందని కథనాలు చెబుతున్నాయి.
బార్కస్
బర్కాస్' (Barkas) అనే పేరు ఇంగ్లీష్ పదం 'Barracks' (బ్యారక్స్) నుంచి రూపాంతరం చెంది వచ్చింది. 'బ్యారక్స్' అంటే సైనికులు నివాసం ఉండే సైనిక స్థావరం లేదా నివాస సముదాయం అని అర్థం. నిజాం ప్రభువులు తమ సొంత రక్షణ కోసం అరబ్ యోధులను హైదరాబాద్‌కు తీసుకువచ్చేవారు. వారికోసం ప్రత్యేకంగా కేటాయించిన సైనిక స్థావరమే ఈ బ్యారక్స్. స్థానిక ప్రజల నానుడిలో మరియు ఉర్దూ ఉచ్ఛారణలో ఈ 'బ్యారక్స్' అనే ఆంగ్ల పదం కాలక్రమేణా మార్పు చెంది 'బర్కాస్'గా స్థిరపడింది.
ఏసీ గార్డ్స్
‘ఏసీ గార్డ్స్’ అనే పేరు కూడా చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. 'ఏసీ గార్డ్స్' అనేది 'ఆఫ్రికన్ కేవల్రీ గార్డ్స్' (African Cavalry Guards) అనే ఆంగ్ల పదానికి సంక్షిప్త రూపం ఇది. 19వ శతాబ్దంలో, ఆరవ నిజాం (మీర్ మహబూబ్ అలీ ఖాన్) పాలనా కాలంలో, ఆఫ్రికా (ముఖ్యంగా అబిసీనియా/ఇథియోపియా,సోమాలియా) చెందిన వారిని తన ఆస్థానంలో చేర్చుకున్నారు. తమ కుటుంబానికి, ప్యాలెస్‌లకు రక్షణగా "ఆఫ్రికన్ కేవల్రీ గార్డ్స్" అనే పేరుతో ప్రత్యేక అశ్వకదళాన్ని (Horse Mounted Guards) ఏర్పాటు చేశారు. వారి కుటుంబాల నివాసాల కోసం, క్వార్టర్స్ (బ్యారక్స్) నిర్మించి కేటాయించిన ప్రాంతమే కాలక్రమేణా 'ఏసీ గార్డ్స్' (A.C. Guards) గా ప్రసిద్ధి చెందింది.
కోటి
పూర్వం బ్రిటీష్ రెసిడెంట్ నివాసం కోసం ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించారు. ఉర్దూ/హిందీ భాషల్లో 'కోఠి' అంటే పెద్ద భవంతి లేదా కోట వంటి నివాసం అని అర్థం. బ్రిటీష్ రెసిడెన్సీ (ప్రస్తుతం కోటి మహిళా కళాశాల) ఉండటం వల్ల ఈ ప్రాంతానికి 'కోటి' అనే పేరు వచ్చింది.
కాచిగూడ
'కాచి' లేదా 'కాచో ప్రాకార్' అనేది రాజస్థానీ క్షత్రియ సామాజిక వర్గానికి (కాచీలు) చెందిన పేరు. నిజాం కాలంలో వీరు ఇక్కడ స్థిరపడి పుష్పాలు, కూరగాయల సాగు చేసేవారు. 'గూడ' అంటే ఆవాసం/వసతి. కాచీలు నివసించే ప్రాంతం కాబట్టి ఇది 'కాచిగూడ' అయింది.
లక్డీకాపూల్
హైదరాబాద్‌లో నిత్యం వేలాది మంది ప్రయాణించే లక్డీకాపూల్ పేరు వెనుక ఓ చిన్న వంతెన కథ ఉంది. ఉర్దూలో 'లక్డీ' అంటే కలప/కర్ర, 'పూల్' అంటే వంతెన. అంటే అక్షరాలా ‘చెక్క వంతెన’ అని అర్థం. సికింద్రాబాద్-నాంపల్లి ప్రాంతాలను కలిపే రైల్వే మార్గం మీద ఒకప్పుడు చెక్కతో నిర్మించిన వంతెన ఉండేది. ఆ వంతెన కారణంగానే చుట్టుపక్కల ప్రాంతానికి ‘లక్డీకాపూల్’ అనే పేరు స్థిరపడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1940ల నాటి ఈ వంతెన పొడవు సుమారు 27 అడుగులుగా నమోదైంది.
ఏఎస్ రావు నగర్
ఆధునిక భారత శాస్త్ర, సాంకేతిక ప్రస్థానంలో సికింద్రాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్స్ రంగానికి కొత్త దిశ చూపిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అయ్యగారి సాంబశివరావు (ఏ.ఎస్. రావు) సేవలను స్మరించుకుంటూ ఈ ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు.
హిమాయత్‌నగర్
హైదరాబాద్ నగరంలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రముఖ నివాస, వ్యాపార కేంద్రాలలో 'హిమాయత్‌నగర్' ఒకటి. హైదరాబాద్ చివరి ప్రభువైన ఏడవ నిజామ్ మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్దకుమారుడు, రాజకుమారుడైన మీర్ హిమాయత్ అలీ ఖాన్ (అజామ్ జా) జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి 'హిమాయత్‌నగర్' అని నామకరణం చేశారు.
బషీర్‌బాగ్
నవాబ్ అస్మాన్ జా బహదూర్ (ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా) పేరు మీదుగా ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అని పేరు వచ్చింది. ఇతను 1880 ప్రాంతంలో ఇక్కడ బషీర్‌బాగ్ ప్యాలెస్ ను కట్టించాడు. విద్య, క్రీడలతోనూ బషీర్‌బాగ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆరవ అసఫ్‌జాహీ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1887లో స్థాపించిన నిజాం కాలేజ్, హైదరాబాద్‌లోని ప్రముఖ క్రీడా వేదిక లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఇక్కడే ఉన్నాయి.
రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ప్రాంతాన్ని అప్పట్లో మదిరె (కొన్ని దుకాణాల సముదాయం) గా పిలిచేవారు. 1955 జులై 4న భారత రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేసి ఓ మొక్కను నాటారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని రాజేంద్రనగర్ గా పిలుస్తున్నారు.
చిక్కడ్‌పల్లి
హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక, విద్యా కేంద్రం. ప్రసిద్ధ సిటీ సెంట్రల్ లైబ్రరీ, త్యాగరాయ గానసభ ఇక్కడ ఉన్నాయి. 'చిక్కడ్' అంటే ఉర్దూ/హిందీ భాషల్లో బురద అని అర్థం, 'పల్లి' అంటే గ్రామం. పూర్వకాలంలో ఇది పల్లపు ప్రాంతం కావడం వల్ల వర్షపు నీరు చేరి ఎప్పుడూ బురదగా ఉండేది, అందుకే ఈ పేరు వచ్చింది.
హయత్ నగర్
కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కుమార్తె 'హయాత్ బక్షీ బేగం' పేరు మీదుగా ఈ ప్రాంతానికి హయాత్‌నగర్ అని పేరు వచ్చింది. విజయవాడ జాతీయ రహదారి (NH 65)పై ఉన్న ప్రధాన ద్వారం వంటి ప్రాంతం. ఇక్కడి చారిత్రక హయాత్ బక్షీ మసీదు, వేగంగా విస్తరిస్తున్న నివాస రంగానికి ఇది ప్రసిద్ధి.
అమీర్‌పేట్
నిజాం రాజుల కాలంలో ఈ ప్రాంత భూములను అప్పటి జాగీర్దార్ అయిన 'అమీర్ అలీ' అనే ఉన్నతాధికారికి బహుమతిగా ఇచ్చారు. ఆయన పేరు మీదుగానే 'అమీర్‌పేట్' అనే పేరు స్థిరపడింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్, ఐటీ కోచింగ్ సెంటర్లకు, వాణిజ్య సముదాయాలకు ఇది ప్రధాన కేంద్రంగా వెలుగుతోంది.
గచ్చిబౌలి
సైబరాబాద్ పరిధిలోని ప్రధాన ఐటీ, కార్పొరేట్, స్పోర్ట్స్ హబ్. బహుళ జాతీయ కంపెనీలు (MNCs) మరియు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఇక్కడ ఉన్నాయి. 'గచ్చి' అంటే సున్నపు గార (lime mortar), 'బౌలి' అంటే దిగుడు బావి. పూర్వకాలంలో సున్నపు రాతితో నిర్మించిన దిగుడు బావి ఇక్కడ ఉండటం వల్ల 'గచ్చిబౌలి' అని పిలిచేవారు.
దిల్‌సుఖ్‌నగర్
1960ల కాలంలో ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, నివాస ప్లాట్లుగా అభివృద్ధి చేసిన ప్రముఖ భూస్వామి 'దిల్‌సుఖ్ రామ్' పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. ఈస్ట్ హైదరాబాద్‌లో అతిపెద్ద వాణిజ్య ప్రాంతం. వేలాది షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు ఇది చిరునామా.
నారాయణగూడ
ఈ ప్రాంతంలో నివసించిన ప్రముఖ నాయకుడు నారాయణ పేరు లేదా ఇక్కడి నారాయణస్వామి దేవాలయం ఆధారంగా 'నారాయణగూడ' అనే పేరు వచ్చింది. సెంట్రల్ హైదరాబాద్‌లోని ప్రముఖ ఎడ్యుకేషనల్ హబ్. అనేక పాతకాలపు ప్రసిద్ధ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి.
గన్‌ఫౌండ్రీ
అబిడ్స్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక ప్రాంతం. ప్రముఖ విద్యా సంస్థలు, ప్రభుత్వ ముద్రణాలయాలు, పురాతన చర్చిలు ఇక్కడ ఉన్నాయి. 1785లో రెండవ నిజాం కాలంలో ఫ్రెంచ్ జనరల్ మిచెల్ రేమండ్ ఇక్కడ శతఘ్నులు (ఫిరంగి గుండ్లు) తయారుచేసే కర్మాగారాన్ని ('టాప్ కా సాంఛా') ఏర్పాటు చేశారు. అందుకే దీనికి 'గన్‌ఫౌండ్రీ' అని పేరు వచ్చింది.
ఎస్.ఆర్. నగర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారత మాజీ రాష్ట్రపతి 'నీలం సంజీవరెడ్డి' (Sanjeeva Reddy) గారి జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి సంజీవరెడ్డి నగర్ (S.R. Nagar) అని పేరు పెట్టారు.
ఎర్రగడ్డ
'ఎర్ర' అంటే ఎరుపు, 'గడ్డ' అంటే ఎత్తైన మట్టి దిబ్బ. ఈ ప్రాంతంలో ఎర్రటి మట్టితో కూడిన నేలలు ఉండటం వల్ల దీనికి 'ఎర్రగడ్డ' అనే పేరు వచ్చింది.
తార్నాక
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆనుకుని ఉంటుంది. IICT, CCMB వంటి అనేక ప్రసిద్ధ జాతీయ శాస్త్రీయ పరిశోధనా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. 'తార్' అంటే టెలిగ్రాఫ్ వైర్, 'నాకా' అంటే చెక్‌పోస్ట్. నిజాం కాలంలో వైర్లతో కూడిన చెక్‌పోస్ట్ ఇక్కడ ఉండటంతో దీనికి 'తార్నాక' అని పేరు వచ్చింది.
హబ్సిగూడ
నిజాం సైన్యంలో పహరా కాసే ఆఫ్రికా (అబిసీనియా) దేశస్తులను 'హబ్షీలు' అని పిలిచేవారు. వారు నివసించిన గూడెం (పల్లె) కావడం వల్ల దీనికి 'హబ్సిగూడ' అని పేరు వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి అత్యంత సమీపంలో ఉన్న ప్రముఖ విద్యా, నివాస ప్రాంతం. NGRI (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఇక్కడే ఉంది.
జూబ్లీహిల్స్
1937లో ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సింహాసనాన్ని అధిరోహించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 'రజతోత్సవాలు' (Silver Jubilee) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక జ్ఞాపకార్థం, అప్పటివరకు కొండలు, దట్టమైన పొదలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే నిజాం 'సిల్వర్ జూబ్లీ' వేడుకల జ్ఞాపకంగా ఈ ప్రాంతానికి 'జూబ్లీహిల్స్' అని నామకరణం చేశారు.
సోమాజీగూడ
తెలంగాణ గవర్నర్ నివసించే లోక్ భవన్ ఇదే ప్రాంతంలో ఉంది. హైదరాబాద్‌ను పాలించిన ఆసఫ్‌జాహీ నవాబుల కాలంలో 'సోమాజీ' అనే ప్రముఖ రాజ రెవెన్యూ అధికారి (కార్యదర్శి) ఉండేవారు. ఆయనకు ఈ ప్రాంతంలో సొంత తోటలు, భూములు ఉండేవి. 'గూడ' అంటే ఆవాసం లేదా గ్రామం అని అర్థం. సోమాజీ నివసించిన, ఆయన ఆధీనంలో ఉన్న ప్రాంతం కావడం వల్ల ఇది 'సోమాజీ-గూడ'గా స్థిరపడింది.
పంజాగుట్ట
'పంజా' అంటే ఐదు వేళ్లతో కూడిన హస్తముద్ర (చేయి), 'గుట్ట' అంటే కొండ అని అర్థం. ఇక్కడి ఎత్తైన కొండపై ఉన్న ఒక బండరాయిపై హజ్రత్ అలీ (ప్రవక్త ముహమ్మద్ అల్లుడు) అతి పురాతన హస్తముద్ర (పంజా) సహజ సిద్ధంగా చెక్కబడి ఉందని విశ్వసిస్తారు. ఆ పవిత్ర హస్తముద్ర ఉన్న గుట్ట కావడం వల్ల స్థానిక ప్రజలు దీనిని 'పంజా-గుట్ట' అని పిలవడం ప్రారంభించారు.
ఎల్ బీ నగర్
ఎల్ బీ నగర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరంలోనే అత్యంత రద్దీతో కూడిన కూడళ్లలో ఒకటి. మలిదశ తెలంగాణ పోరాటానికి ఉపిరి పోసిన శ్రీకాంతాచారి బలిదానం చేసుకుందే ఎల్ బీ నగర్ చౌరస్తాలోనే. నల్గొండ, ఖమ్మంతోపాటు ఆంధ్రాలోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గేట్ వేగా ఎల్ బీ నగర్ ప్రాచుర్యం పొందింది. భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1965లో హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన జ్ఞాపకార్థం బహదూర్‌గూడ పంచాయతీ ప్రతిపాదనతో బహదూర్‌గూడ చౌరస్తాకే లాల్‌బహదూర్ చౌరస్తాగా నామకరణం చేశారు. తరవాత అక్కడ కొత్తగా ఏర్పడిన కాలనీకి లాల్‌బహదూర్‌నగర్ (ఎల్ బీ నగర్)గా పేరొచ్చింది.
మెహదీపట్నం
ఆసఫ్‌జాహీ (నిజాం) కాలంలో ప్రముఖ నవాబు, రాజకీయవేత్త అయిన నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మెహదీపట్నం' అనే పేరు వచ్చింది.
కార్వాన్
ఇది పారశీ/ఉర్దూ పదం 'కార్వాన్' (Caravan - వర్తకుల బృందం/సార్థవాహకులు) నుండి వచ్చింది. గోల్కొండ కోట కాలంలో వజ్రాలు, ముత్యాలు, బట్టలు వ్యాపారం చేసే అంతర్జాతీయ వర్తకులు తమ ఒంటెలు, గుర్రాల బండ్లతో వచ్చి బస చేసే ప్రధాన కేంద్రం ఇది. వ్యాపారుల 'కార్వాన్లు' ఆగేవారంతా ఉండే ప్రాంతం కాబట్టి 'కార్వాన్'గా ప్రసిద్ధి చెందింది.
ఆసిఫ్ నగర్
హైదరాబాద్ ఆసఫ్‌జాహీ రాజవంశ స్థాపకుడైన మొదటి నిజామ్ 'నిజామ్-ఉల్-ముల్క్ ఆసఫ్ జా-I' జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి 'ఆసిఫ్ నగర్' అని నామకరణం చేశారు.
మియాపూర్
కుతుబ్ షాహీలు, నిజాంల కాలంలో 'మియా' (Miya - గౌరవనీయుడైన వ్యక్తి/ముస్లిం ప్రముఖుడు) అనే హోదా ఉన్న అధికారులకు లేదా జమీందార్లకు ఇక్కడ జాగీర్లు (భూములు) ఉండేవి. 'మియా సమూహాలు నివసించిన పురం' కావడం వల్ల ఇది 'మియాపూర్' అయింది.
అత్తాపూర్
కుతుబ్ షాహీ పాలనలో సుల్తాన్ అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లేదా అధికారి 'అత్తావుల్లా' (Attaullah) లేదా 'అత్తావుల్లా షా' జ్ఞాపకార్థం 'అత్తావుల్లాపూర్' అని పిలవబడి, కాలక్రమేణా 'అత్తాపూర్'గా మారింది.
మలక్‌పేట్
గోల్కొండ/నిజాం కాలంలో అరబ్ దేశాల నుంచి నాణ్యమైన గుర్రాలను దిగుమతి చేసుకుని వ్యాపారం చేసిన 'మలిక్ యాకూబ్' అనే ప్రముఖ అరబ్ వ్యాపారి పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మలక్‌పేట్' అని పేరు వచ్చింది. ఇక్కడే రేస్ కోర్స్ కూడా ఉండటం విశేషం.
సనత్ నగర్
సనత్ నగర్' పేరుకు సంబంధించి రెండు విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఉర్దూ భాషలో 'సనత్' అంటే పారిశ్రామిక రంగానికి, చేతివృత్తులకు లేదా తయారీ రంగానికి సంబంధించినది అని అర్థం. 7వ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, 'సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్' (CIB) ఆధ్వర్యంలో 1941 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పారిశ్రామిక జోన్‌గా (Industrial Zone) అభివృద్ధి చేశారు. అందుకే దీనికి 'సనత్ నగర్' (పారిశ్రామిక నగరం) అని పేరు వచ్చింది అనేది ఒక కథనం.
నిజాం పాలనలో పారిశ్రామిక, ఆర్థిక ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించిన అధికారి నవాబ్ సనత్‌వుల్లా ఖాన్ పేరు మీదుగానే ఈ ప్రాంతానికి సనత్ నగర్ అని నామకరణం చేశారనే ఉల్లేఖనాలు కూడా స్థానిక చరిత్ర రచనల్లో, కొన్ని కథనాల్లో కనిపిస్తాయి.
కూకట్‌పల్లి
హైదరాబాద్ వాయువ్య భాగంలో విస్తరించిన కూకట్‌పల్లి.. ఒకప్పుడు చిన్న గ్రామం. నేడు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆసియాలోనే అతిపెద్ద నివాస కాలనీ KPHB ఇక్కడే ఉంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న ఒక కథనం ప్రకారం.. ‘కూకట్ల’ అనే పేరున్న ఓ భూస్వామికి ఈ ప్రాంతంలో పెద్దఎత్తున భూములు ఉండేవని, ఆయన పేరు మీదుగా ‘కూకట్లపల్లి’గా పిలవబడుతూ కాలక్రమంలో ‘కూకట్‌పల్లి’గా మారిందని చెబుతారు.
పూర్వం ఈ ప్రాంతం దట్టమైన పొదలు, చెట్లు, గుట్టలతో నిండి ఉండేది. ఇక్కడి అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లను నరికి, వాటి నుంచి లభించే 'కూకట్లు' (లావుపాటి కర్రలు, దుంగలు, చెక్క ముక్కలు) సేకరించడం స్థానిక తెగల ప్రథమ వృత్తిగా ఉండేది. కూకట్లు' సమృద్ధిగా లభించే గ్రామం (పల్లి) కావడం వల్ల దీనికి మొదట "కూకట్లపల్లి" అని పేరు వచ్చింది. కాలక్రమేణా 'కూకట్‌పల్లి' (Kukatpally) గా స్థిరపడింది.
ఉప్పల్
పూర్వం ఈ గ్రామానికి దక్షిణ దిశగా ప్రవహించే మూసీ (ముకుంద) నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఊరిని ముంచెత్తేవి. ఆ వరద ముప్పు, ఇతర ఆపదల నుంచి గ్రామాన్ని కాపాడటానికి స్థానిక ప్రజలు 'ఉప్పలమ్మ దేవి' (ఉప్పలమ్మ తల్లి) ని తమ గ్రామదేవతగా కొలుచుకోవడం ప్రారంభించారు. గ్రామదేవత ఉప్పలమ్మ తల్లి పేరు మీదుగా ఈ ప్రాంతానికి మొదట "ఉప్పలపురం" అని నామకరణం చేశారు కాలక్రమేణా ఆ పేరు వాడుకలో 'ఉప్పల్' గా స్థిరపడింది.