నవంబర్‌ 30న హైదరాబాద్‌లో ఆటో బంద్‌ నిర్వహిస్తామని జేఏసీ నాయకుల ప్రకటించారు. 
తెలంగాణ

నవంబర్‌ 30న హైదరాబాద్‌లో ఆటో బంద్‌.. జేఏసీ హెచ్చరిక!

ఆటో డ్రైవర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని జేఏసీ నాయకులు ప్రకటించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, ముషీరాబాద్ : ఆటో మీటర్‌ చార్జీల పెంపుతో పాటు తమ 15 డిమాండ్లను నెల రోజుల్లో పరిష్కరించాలని మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో నవంబర్‌ 30న హైదరాబాద్‌లో ఒకరోజు ఆటో బంద్‌ నిర్వహిస్తామని జేఏసీ కన్వీనర్‌ మహమ్మద్‌ అమానుల్లా ఖాన్‌ హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

బెంగళూరు తరహాలో మీటర్‌ చార్జీలు పెంచాలి

గురువారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌ న్యూస్‌ సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమానుల్లా ఖాన్‌ మాట్లాడారు. ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.14గా ఉన్న ఆటో చార్జీని బెంగళూరులో అమలవుతున్న రూ.18కు పెంచాలని కోరారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆటో మీటర్‌ చార్జీలను సవరించాలని పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్ల 15 డిమాండ్లు ఇవే!

ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఫైనాన్షియర్ల వేధింపులను అరికట్టడం, బైక్‌ ట్యాక్సీలను నిషేధించడం, ఈ-చలాన్ల నుంచి మినహాయింపు ఇవ్వడం, ప్రమాద బీమా కొనసాగించడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు నెల రోజుల్లో చర్యలు తీసుకోకపోతే నవంబర్‌ 30న ఆటో బంద్‌ నిర్వహిస్తామని నాయకులు స్పష్టం చేశారు. అప్పటికీ స్పందన లేకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు డైమండ్‌ సలీం, ముస్తాక్‌ సిద్ధిఖీ, మారుతి జగ్తాప్‌, ముజాహిద్‌ హష్మీ, అబ్దుల్‌ రజాక్‌, ఆర్‌. నర్సింగరావు, రమేష్‌, మహమ్మద్‌ అక్తర్‌, మహమ్మద్‌ దస్తగిర్‌, మహమూద్‌ తదితరులు పాల్గొన్నారు.