హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్యానీ, పాతబస్తీ సంస్కృతితో పాటు ఠక్కున గుర్తుకొచ్చేది ఇరానీ ఛాయ్–ఉస్మానియా బిస్కట్ జోడీ. వేడివేడి కడక్ ఛాయ్ సిప్ చేస్తూ.. పక్కన ఉస్మానియా బిస్కట్‌ను ఛాయ్‌లో ముంచుకుని తింటే ఆ మజానే వేరు భాయ్! ఇది ఏదో జస్ట్ టీ, బిస్కట్ కాంబినేషన్ కాదు.. హైదరాబాద్ జీవనశైలిలో కలిసిపోయిన ఓ ఎమోషన్! ఉస్మానియా బిస్కెట్ తింటూ హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగితే ఉంటుంది ఆ కిక్కే వేరు. పాత ఇరానీ కేఫేల నుంచి నేటి హైదరాబాద్ వరకు తరతరాలుగా కొనసాగుతున్న ఈ రుచికరమైన అనుబంధం వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇరానీ ఛాయ్ హైదరాబాద్‌కు ఎలా వచ్చింది? ఉస్మానియా బిస్కట్ పుట్టుక వెనుక కథేంటి? ఈ రెండూ నగర సంస్కృతిలో ఎలా భాగమయ్యాయో తెలుసుకుందాం..
ఇరానీ ఛాయ్.. హైదరాబాద్‌లో మస్తు క్రేజ్!
హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్ అంటే మస్తు క్రేజ్! తెల్లని కప్పు–సాసర్‌లో పొగలు కక్కుతూ, ఘుమఘుమలాడే ఇరానీ ఛాయ్ గొంతులో పడనిదే.. హైదరాబాద్‌లో చాలామందికి రోజు మొదలైనట్టే అనిపించదు. దాని చిక్కదనం, గోధుమ వర్ణం, పాలతో కలిసిన ఆ ప్రత్యేకమైన రుచి.. ఒక్కసారి తాగితే మరో కప్పు కోసం మనసు లాగేస్తుంది. బ్లాక్ టీ, ఇలాచీ టీ, జింజర్ టీ, జాఫ్రానీ టీ.. ఇలా ఎన్ని రకాల చాయ్‌లు ఉన్నా.. హైదరాబాదీ ఇరానీ ఛాయ్ రుచికి, దాని ప్రత్యేకతకు మాత్రం సాటిరావు!
ఇరాన్ నుంచి హైదరాబాద్‌కు..
హైదరాబాద్‌కు, ఇరానీ ఛాయ్‌కు మధ్య ఏర్పడిన అనుబంధం వెనుక వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. నిజాం పాలనలో హైదరాబాద్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు నడిచేవి. అందుకే కొంతమంది ఇరానీ వ్యాపారులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చినవారు ఇరానీ చాయ్ దుకాణాలు తెరిచారు. ఆ విధంగా 19వ శతాబ్దం చివరి దశల్లో పర్షియా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ఇరానీయులు తమతోపాటు చాయ్ తయారీ, కేఫే సంస్కృతిని కూడా తీసుకొచ్చినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలో ఏర్పడిన ఇరానీ కేఫేలు క్రమంగా నగర జీవనశైలిలో భాగమయ్యాయి. అలా మొదలైన ఈ చాయ్ ప్రయాణం కాలక్రమంలో హైదరాబాద్ ప్రత్యేకతగా మారి, నేటికీ నగర వీధుల్లోని కేఫేల నుంచి ఘుమఘుమలాడుతూనే ఉంది.
చిక్కటి పాలు.. గాఢమైన డికాషన్.. సీక్రెట్!
ఇరానీ ఛాయ్ ప్రత్యేకమైన రుచి వెనుక దాని తయారీ విధానమే ప్రధాన కారణం. సాధారణ టీలా పాలు, టీ పొడిని ఒకేసారి మరిగించకుండా.. పాలు, టీ డికాషన్‌ను విడివిడిగా సిద్ధం చేస్తారు. ముందుగా పాలను తక్కువ మంటపై నెమ్మదిగా మరిగిస్తూ చిక్కగా చేస్తారు. కొన్ని చోట్ల రుచిని మరింత పెంచేందుకు మలాయ్ లేదా ఖోయాను కూడా కలుపుతారు. మరోవైపు టీ పొడిని నీటిలో ఎక్కువసేపు మరిగించి గాఢమైన డికాషన్‌ను సిద్ధం చేస్తారు. ఇలా తయారైన చిక్కటి పాలలోకి గాఢమైన టీ డికాషన్‌ను సరైన మోతాదులో కలిపినప్పుడు ఇరానీ ఛాయ్ అసలైన రుచి, గోధుమ వర్ణం, కమ్మటి సువాసనను సంతరించుకుంటుంది. ఈ రెండు భాగాలను విడివిడిగా తయారు చేసి చివర్లో కలపడమే సాధారణ టీతో పోలిస్తే ఇరానీ ఛాయ్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
ధర పెరిగినా.. హైదరాబాదీల చాయ్ చస్కా తగ్గలేదు!
కాలంతో పాటు ఇరానీ ఛాయ్ ధర పెరుగుతూ వచ్చినా.. దానిపై హైదరాబాదీల మోజు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు పైసల్లో లభించిన ఈ ఛాయ్.. కాలక్రమంలో రూపాయి, రెండు రూపాయలు దాటి ఇప్పుడు పాతిక రూపాయలకు చేరింది. 1993లో సుమారు 60 పైసలు ఉన్న ఇరానీ ఛాయ్ ధర 2000 నాటికి రూ.2కు, 2010లో రూ.5కు, 2019లో రూ.10కు, ప్రస్తుతం రూ.30-80కు చేరింది. ధర పెరిగినా.. కప్పులోని ఆ ప్రత్యేకమైన రుచి కోసం నగరవాసులు ఇప్పటికీ ఇరానీ కేఫేల బాట పడుతూనే ఉన్నారు. ఎందుకంటే హైదరాబాదీలకు ఇది కేవలం ఓ కప్పు ఛాయ్ కాదు.. తరతరాలుగా నగర జీవనశైలితో ముడిపడిపోయిన ఓ రుచికరమైన జ్ఞాపకం, హైదరాబాద్ సంస్కృతిలో ఓ విడదీయరాని భాగం.
నిజాం మెచ్చిన రుచి.. ఉస్మానియా బిస్కట్
ఉస్మానియా బిస్కట్ పుట్టుక వెనుక హైదరాబాద్ నగరానికి ఉన్నట్లే ఒక విడదీయరాని రాజసంతో కూడిన ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఏడో నిజా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో, ఆయన ఆస్థాన పాకశాస్త్ర నిపుణులను (Royal Bakers) పిలిచి, సాయంత్రం వేళల్లో టీతో పాటు తినడానికి రుచిగా, కొత్తగా ఉండే ఒక అల్పాహారాన్ని సిద్ధం చేయమని కోరారు. దాంతో ఆస్థాన బేకర్లు తీపి, కాస్త ఉప్పు, వెన్నను సమపాళ్లలో మిశ్రమం చేసి, ప్రత్యేకమైన ఉష్ణోగ్రత వద్ద కాల్చి ఒక మెత్తటి బిస్కట్‌ను తయారు చేశారు. ఈ బిస్కట్ రుచికి నిజాం ప్రభువు ఎంతో మురిసిపోయి, మెచ్చుకోవడంతో ఆయన పేరు మీదుగానే దీనికి 'ఉస్మానియా బిస్కట్' అని పేరు స్థిరపడిపోయింది.
ఉస్మానియాతో ముడిపడిన మరో కథ
అయితే ఈ బిస్కట్ పుట్టుక వెనుక మరొక ప్రజాదరణ పొందిన కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో నగరంలో కొత్తగా నిర్మించిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని రోగులకు పోషకాహారంతో పాటు సులభంగా జీర్ణమయ్యేలా, రుచికరంగా ఉండే ఒక పదార్థాన్ని అందించాలని వైద్యులు భావించారు. ఆస్పత్రిలోని డైటిషియన్లు, బేకర్లు కలిసి రూపొందించిన ఈ బిస్కట్, రోగులకే కాకుండా ఆస్పత్రిని సందర్శించే బంధువులకు, వైద్యులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నగరంలోని ప్రధాన ఇరానీ కేఫేలకు వ్యాపించి, నగర ప్రజల నిత్య జీవితంలో భాగమైపోయింది.
ఇరానీ ఛాయ్‌కి పర్‌ఫెక్ట్ జోడీ..
కాలక్రమేణా పాతబస్తీలోని ప్రసిద్ధ నిమ్రా, సుభాన్ బేకరీలతో పాటు పాత ఇరానీ కేఫేలు ఉస్మానియా బిస్కట్ తయారీని ఒక కళగా మార్చేశాయి. బయట కాస్త కరకరలాడుతూ, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ బిస్కట్, వేడివేడి ఇరానీ ఛాయ్‌తో కలిపి తింటే ఇచ్చే మజా మరే ఇతర పిండి వంటకంలోనూ దొరకదు. నైజామ్ కాలం నాటి రాజసంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఈనాడు హైదరాబాద్ సంస్కృతిలో భాగమై, నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పక రుచి చూడాల్సిన ఒక ఐకానిక్ వంటకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.