ప్రభాత ఉదయం, సిటీ స్పోర్ట్స్ : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగులకు అండగా నిలిచేందుకు నగరవ్యాప్తంగా 38 కేంద్రాల్లో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. సుమారు 30 బ్లడ్ బ్యాంకుల సహకారంతో 5,700 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
అమరవీరుల స్మారకార్థం సేవా కార్యక్రమాలు
గురువారం పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన కేంద్రాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు నగర పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. అక్టోబరు 21 నుంచి 31 వరకు అమరవీరుల స్మరణార్థం రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజ రక్షణ కోసం పండుగలు, సెలవులను సైతం విడిచిపెట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం త్యాగనిరతి చాటుకుంటున్నారని కొనియాడారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని ఉద్యమంలా చేపట్టి, సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధితులకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం సంజీవనిలా ఉపయోగపడుతుందన్నారు. ఇదే సమయంలో రక్తదానం, అవయవదానంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రైవేటు ఆసుపత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
అమరుల త్యాగాలకు నిజమైన నివాళి: సీపీ సజ్జనర్
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నిజమైన నివాళి అర్పించాలనే ఉద్దేశంతో కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నిజమైన నివాళి అర్పించాలనే సంకల్పంతోనే కమిషనరేట్ పరిధిలో పెద్దఎత్తున ఈ శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులతో పాటు రెడ్‌క్రాస్, తలసేమియా ఫౌండేషన్, రోటరీ, లయన్స్ క్లబ్ వంటి సంస్థలకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్) ఎం. శ్రీనివాసులు,అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్) తప్సీర్ ఇక్బాల్ , జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఆర్. వెంకటేశ్వర్లు, రాహుల్ హెడ్గే డీసీపీ ట్రాఫిక్, విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ శ్రీమతి లావణ్యనాయక్ జాదవ్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరాణ్ ప్రభాకర్, రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ అన్ని జోన్ల డీసీపీలు, ఇతర అధికారులు, బ్లడ్ బ్యాంకులకు చెందిన వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
చార్మినార్ జోన్‌లోనూ భారీ స్పందన
చార్మినార్ జోన్ పరిధిలోనూ పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మీర్‌చౌక్‌లోని గుల్జార్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ ప్రారంభించారు. బండ్లగూడలోని శిబిరాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ ప్రారంభించారు. హుస్సేనియాలం షా మంజిల్, అలియాబాద్ రెడ్డి జన సంఘం కమ్యూనిటీ హాల్, గుల్జార్ ఫంక్షన్ హాల్, సైదాబాద్ ఎలైట్ ఫంక్షన్ హాల్, మలక్‌పేట్ ఆఫీసర్స్ మెస్, సంతోష్‌నగర్ రాడాన్ ఫంక్షన్ హాల్ తదితర ప్రాంతాల్లో రక్తదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఛత్రినాక డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో అలియాబాద్ రెడ్డి జన సంఘం కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన శిబిరానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. చార్మినార్ ట్రాఫిక్ మెటర్నిటీ హాస్పిటల్ మెగా బ్లడ్ బ్యాంక్ శిబిరానికి కూడా విశేష స్పందన లభించింది. ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని, ప్రమాద బాధితులు, తలసేమియా రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్ అడిషనల్ డీసీపీ, ఎండి జావిద్. ఛత్రినాక, మొగల్ పుర, శాలిబండ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.